– చంద్రబాబు విజ్ఞప్తికి డిప్యూటి సీఎం భట్టి సానుకూల స్పందన
– సీఎం రేవంత్‌తో చర్చించి సహాయక బృందాలను పంపేందుకు ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవిలు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు గురువారం ఫోన్ చేసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు భట్టికి వివరించారు. తుఫాన్ కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతోపాటు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, వందల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్తు సిబ్బంది, యంత్రాలు అవసరమని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వ సహాయాన్ని కోరారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు సాంకేతిక సహయక బృందాలను, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను త్వరగా పునరుద్ధరించేందుకు తగు యంత్రాలను సమకూర్చాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
విద్యుత్తు అధికారులకు డిప్యూటి సీఎం ఆదేశాలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సహకారం అందించడానికి సహాయక బృందాలను పంపాలని ఏపీ¾ సీఎం కోరిన విషయమై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన ఆనంతరం ఏపీకి సహాయక బృందాలను పంపాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డిలను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కోరిన సహాయాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ పాటిల్ తక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొనేందుకు ఎస్పీడీసీఎల్ ఉద్యోగులతో సహాయక బృందాలను సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు. సూర్యాపేట జిల్లా నుంచి ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు తరలి వెళ్లారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఈ బృందాలు సహకారం అందించనున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





