- వికసిత భారత్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు
- మోదీ ప్రకటనల్లో డొల్లతనం తప్ప మరోటి కాదు
- పన్నుల రూపంలో ప్రజల డబ్బులతో నేతల జల్సాలు..
ఉచిత పథకాలు, తాయిలాలు, ఉచిత బియ్యం, రూపాయికే కిలో బియ్యం, పెన్షన్లు ఇవే అభివృద్ది, ఇవే పాలన అన్న తీరుగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. పేదవారి పేరు చెప్పి పథకాల పేరుతో పందేరాలు చేస్తున్నారు. తమ అధికారం నిలుపుకోవడమెలా అన్న కోణంలోనే పథకాలు, పందేరాలు సాగిస్తూ పాలన చేస్తున్నారు. అందుకే దేశం అధిక జనాభాకు తోడు అనేకానేక సమస్యలను మోయాల్సి వస్తోంది. స్వాతంత్య్రం సాధించి దాదాపు 78 ఏళ్లు కావస్తున్నా ఇంకా సామాన్యుల జీవితాల్లో మార్పులు కానరావడం లేదు. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బులతో నేతలు జల్సాలు చేస్తున్నారు.
ఇంతకుమించిన అభివృద్ది జరగడం లేదు. పేదలు ఇంకా పేదలుగానే మగ్గుతున్నారు. పేదల పేరు చెప్పి ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారన్నది ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. మనకు విదిలిస్తున్న డబ్బులతో అధికా పన్నులు ఏదో ఒక రూపంలో వసూలు చేయక తప్పదని కూడా గుర్తించాలి. ప్రజలు గుడ్డిగా నమ్మిన కారణంగా అభివృద్ది అన్నది అడుగంటి పోతుంది. అప్పులు చేసి దివాలా తీయిస్తున్నా..పరిష్కారం చూడడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత పాలకులు కెసిఆర్, జగన్‌లు రాష్ట్రాలను దివాలా తీయించారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇప్పుడు ప్రజలు క్షోభ పడుతున్నారు. అభివృద్ధి ఆగిపోతోంది. ఇలాంటి సందర్భంగా అప్పలుపై చర్చ చేసి, అప్పులు చేయకుండా కట్టడి చేయాలి. అదేపనిగా అప్పులు చేస్తూ పోతే రాష్ట్రాలు దివాలా తీస్తాయి. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి వస్తుంది.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే ప్రజలు బాగుపడతారని అనుకున్నారు. ఉద్యోగ ఉపాధి లభిస్తుందని అన్నారు. అయితే ఓ కుటుంబం రాజభోగాలు అనుభవించింది. వారి అనుయాయులు పదవులు దక్కించుకున్నారు. భూములు మాయం అయ్యాయి. 7లక్షల కోట్ల అప్పులు చూపారు. ఎపిలో జగన్ కుటుంబం రాజకీయ భోగాలు అనుభవించింది. రాష్ట్ర విభజన పాపం కారణంగా రెండు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుని పోయి ఒకటి రెండు కుటుంబాలు బాగుపడ్డాయి. పదేళ్లుగా కేంద్రంలో మోదీ, అతని అనుయాయులు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. కొరోనా తరవాత ప్రజల ఆర్థిక స్థితిగతులు అధ్వాన్నంగా మారినా పట్టింపు లేకుండా పోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ధరలు దాడి చేస్తున్నాయి. తిండిగింజలు కొనడం గగనంగా మారింది. పప్పులు, ఉప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు ధరలు కారణంగా మరింతగా ధరలు దాడి చేస్తున్నాయి. వివిధ రూపాల్లో పన్నులు పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. సామాన్యులు ఇల్లు కట్టుకునే భాగ్యం లేని పరిస్థితులు వచ్చాయి. ఇన్సూరెన్స్ చేసుకుందామనుకున్నా జిఎస్టీ కొరడాలు ఝళిపిస్తున్నారు.
ఇవన్నీ చర్చించడంలో విపక్షాలు విఫలం అవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించగలిగేలా ఇవన్నీ ఉన్నాయి. కానీ తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను పంపితే యాగీ చేస్తున్నారు. ఏ దేశంలో అయినా ఇది సాధారణమే. మనం మాత్రమే మిన్నకున్నాం. ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్నారంటేనే దేశంలో అవకాశాలు లేవని అర్థం. జిఎస్టీపై పార్లమెంటులో ప్రస్తావన వస్తే చర్చించలేని పెద్దలు పేదల గురించి, దేశం పురోగతి గురించి ఆలోచిస్తారంటే ఎలా నమ్మడం. వీరి చేతుల్లో ఉన్న పనులనే చేయడం లేదు. జిఎస్టీ ట్యాక్సులను తగ్గించలేని వారు, ఉపాధి కల్పనకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోలేని వారు వ్యవసాయాన్ని అభివృద్ది చేయాలనే ఆలోచన లేని వారు, నదీ జలాలలను సద్వినియోగం చేయాలనే పట్టుదల లేని వారు..
దేశాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్మగలమా? దేశం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులను ఉపయోగించుకోవాలి. వ్యవసాయిక దేశంగా ఉన్న మన దేశంలోని భూములను వినియోగంలోకి తీసుకుని రావాలి. నీరు సముద్రం పాలు కాకుండా వాడుకోగలగాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాజకీయ నాయకుల జీతభత్యాలు తొలుత తగ్గించాలి. పెట్టుబడులు పెరగాలి. తయారీ, సేవలు, ఎగుమతుల తయారీ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం పరిశోధనలు చేయాలి. దేశ యువతకు ఉపాధి చూపించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దిశగా మన ఆర్థిక విధానాలు వుండాలి. అప్పుడే తయారీ రంగంతో పాటు, మౌళిక రంగాలు అంటే రైల్వే, రోడ్లు, గృహ వసతి, నీటి పారుదల, విద్యుత్, విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడులుగా పెరుగుతాయి.
విపక్షాలుప్రజల సమస్యల కన్నా సొంత ఎజెండాతో పనిచేస్తున్నారు. స్వాతంత్య్రం వొచ్చి వందేళ్ళు పూర్తయ్యే 2047 నాటికి మన దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుస్తామని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనం తప్ప మరోటి కాదు. గత పదేళ్లుగా చేసిన, చేస్తున్న నిర్వాకంతో ప్రజలు బతికి బట్ట కట్టడమే భారంగా మారుతోంది. వికసిత భారత్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశం అంటే ప్రజలు తమంత తాముగా బతకగలగాలి. అందుకు అనువైన పరిస్థితులు కల్పించాలి. స్వయం ఉపాధి రంగాలు బలపడాలి. వ్యవసాయం బలోపేతం కావాలి. రైతులు ధీమాగా బతకగలగాలి. కానీ అలా జరగడం లేదు. దేశంలోని ప్రజల సగటు తలసరి ఆదాయాన్ని బట్టి అభివృద్ధి చెందిన, చెందుతున్న లేదా వెనుకబడిన దేశాలుగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు లెక్కగడుతాయి.
ప్రజలు సొంతంగా ఇళ్లు కొనుక్కోలేక పోతున్నారంటేనే దేశం అభివృద్ది చెందడం లేదని అర్థం. మూడు కోట్ల ఇళ్లు కట్టిస్తామని మోదీ చేసిన ప్రకటన దేశ దౌర్భాగ్య పరిస్తితులను సూచిస్తోంది. ఈ రంగాల్లో పెట్టుబడి ఖర్చులు ఎక్కువ,ఆదాయం తక్కువ. కావున, ప్రైవేట్ పెట్టుబడులు రావు. ప్రభుత్వ మే ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. కానీ 1991 తర్వాత అమలవుతున్న ప్రపంచీకరణ విధానాలు సరిగ్గా ఇందుకు విరుద్ధంగా వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, రైల్వే, రోడ్లు, విమానాశ్ర యాలు, ఓడరేవులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికం, విద్య, వైద్య రంగాలతో పాటు కీలకమైన వ్యవసయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాలను గత 25 సంవత్సరాలుగా పాలకులు అమలు చేస్తున్నారు. దీని ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఈ విధానాలు పోతేనే దేశం బాగుపడుతుందని గుర్తించాలి.
మిట్టపల్లి మహేందర్
సీనియర్ జర్నలిస్ట్
9030899144





