గత శనివారం నాడు హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోని ప్రధాన పూజారి రంగరాజన్ ఇంట్లోకి రామరాజ్యం సేన నాయకుడు వీరరాఘవరెడ్డితో సహా దాదాపు ఇరవై మంది ఆగంతుకులు జొరబడ్డారు. ఆ దుండగులు దాదాపు నలభై నిమిషాల పాటు వయోవృద్ధుడైన రంగరాజన్ ను, ఆయన కొడుకును వేధించారని, కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, దుర్భాషలాడారని తెలుస్తున్నది. రంగరాజన్ ను నిస్సహాయంగా ఒక మూలకు కింద కూచోబెట్టి, వీరరాఘవరెడ్డి దౌర్జన్యపూరితంగా అరుస్తూ, నిలదీస్తున్న వీడియో ఒకటి రామరాజ్యం సేన స్వయంగా విడుదల చేసింది. అది కత్తిరించిన వీడియోనో, మొత్తం జరిగిన దాడిలో కొంతభాగానికి సంబంధించిన వీడియోనో తెలియదు.
ఆ స్వల్పకాలపు వీడియో ప్రకారమే చూసినా, వీరరాఘవరెడ్డి తాను ఇక్ష్వాకు వంశపు వాడినని చెప్పుకున్నాడు. సమస్త భూమీ ఇక్ష్వాకు వంశానిదే అని రాముడు చెప్పాడు గనుక, ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి అర్చకుడి బాధ్యతా ఆ భూమిని ఇక్ష్వాకులకు తిరిగి సంపాదించి పెట్టే ఏర్పాటు చెయ్యడమే అన్నాడు. ఆ పని ఆయన అర్చకులకు ఎందుకు ఇస్తున్నాడంటే, గుడికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రవర (వంశ చరిత్ర) పూజారులు తెలుసుకుంటారు గనుక వారిలో ఇక్ష్వాకు వంశ గోత్రీకులెవరో, వైశ్య గోత్రీకులెవరో తెలుసుకుని వారిని రామరాజ్య స్థాపనకు పురికొల్పాలట. ఆ సమాచారం రామరాజ్యం సేనకు అందిస్తే, వారందరినీ తన సేనలోకి తీసుకుంటానన్నాడు. ఈ పనులు చేయకపోతే పూజారికి పాండిత్యం లేనట్టేనని తూష్ణీభావం ప్రకటించాడు. తన ప్రేలాపనకు మద్దతుగా బట్టీ పెట్టిన ఓ నాలుగైదు శ్లోకాలు వల్లించాడు. రాగయుక్తంగా ఒకటి రెండు వచనాలు చదివాడు. రామరాజ్య స్థాపనకు సహకరించనందుకు పోలీసు అధికారులను, ప్రభుత్వాధికారులను, న్యాయమూర్తులను, ప్రభుత్వాలను కూడా విమర్శించాడు. న్యాయమూర్తులనైతే తోలు వలుస్తానన్నాడు.
మామూలు సమాజంలోనైతే ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలుగా కొట్టి పారెయ్యవచ్చు. నిజంగానే వీరరాఘవరెడ్డి వాడిన నాటకీయ భాష, పదాల, వాక్యాల విరుపులు, హావభావాలు ఒక అధమస్థాయి నటుడి కన్నా ఎక్కువ ఏమీ కావు. అవన్నీ అతను పిచ్చాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడనో, పిచ్చాస్పిటల్కి పంపించవలసినవాడనో చూపుతున్నాయి. ఇప్పుడు ఈ నేరాన్ని కప్పి పుచ్చడానికి అతనికి పిచ్చి అని కూడా కొందరు అంటున్నారు. కొందరు హిందుత్వ ప్రచారకులైతే ఈ దాడి కమ్యూనిస్టులు, మావోయిస్టులు చేసినట్టుగా ఉందని పచ్చి అబద్ధాలు కూడా ప్రచారంలో పెట్టారు. అయితే వీరరాఘవరెడ్డి ఈ మాటలు ఈ శనివారం రంగరాజన్ ముందర మాత్రమే అనలేదు. ఎవరైనా రామరాజ్యం వెబ్ సైట్ మీదికి వెళ్లి అతని మాటలు, ఉపన్యాసాలు, ప్రకటనలు, రామరాజ్యం సేన నియామకాలకు దరఖాస్తులు కోరుతూ చేసిన ప్రకటనలు చూస్తే, అతనిది ఎంతమాత్రమూ పిచ్చి కాదని, అది సంఘ్ పరివార్ వ్యాపింపజేసిన మత మౌఢ్యం, భిన్నాభిప్రాయం పట్ల అసహనం అని స్పష్టంగా కనబడుతుంది. సమస్య వీరరాఘవరెడ్డి అనే వ్యక్తో, అతణ్ని అనుసరించే కొందరు శిష్యులో పిచ్చివాళ్లు కావడం మాత్రమే కాదు. ఇవాళ మన సమాజంలో ఈ ఉన్మాదమే సాధారణ స్థితి అయింది. ఈ ఉన్మాదాన్ని ప్రజలలో వ్యాపింపజేయడానికి, పెంచి పోషించడానికి, రెచ్చగొట్టడానికి సంఘ్ పరివార్ సంస్థలు గత వంద సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి, గత పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ అధికారం దక్కిన అహంకారంతో మరింతగా పెచ్చరిల్లి వికటాట్టహాసాలు చేస్తున్నాయి.
‘‘అందువల్ల ఇది కేవలం వీరరాఘవరెడ్డి సమస్యో, రామరాజ్యం సేన సమస్యో మాత్రమే కాదు. దశాబ్దాలుగా విష విద్వేషాలు నింపి, ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఖండన ప్రకటనలు ఇస్తున్న, రంగరాజన్ కు సానుభూతి వచనాలు పలుకుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలు ఉద్దేశపూర్వ కంగా రగిలించిన చిచ్చు ఇది.’’
అందువల్ల ఇది కేవలం వీరరాఘవరెడ్డి సమస్యో, రామరాజ్యం సేన సమస్యో మాత్రమే కాదు. దశాబ్దాలుగా విష విద్వేషాలు నింపి, ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఖండన ప్రకటనలు ఇస్తున్న, రంగరాజన్ కు సానుభూతి వచనాలు పలుకుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలు ఉద్దేశపూర్వకంగా రగిలించిన చిచ్చు ఇది. ఇప్పుడైనా దాడికి గురయినది ఒక సుప్రసిద్ధ హిందూ దేవాలయ పూజారి గనుక ఇంత పెద్ద ఎత్తున నిరసన, చర్చ జరుగుతున్నది. ఎన్నో చోట్ల నుంచి, ఎన్నో వైపులా నుంచి రామరాజ్యం దాడికి ఖండనలు వస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు రంగరాజన్ కు సానుభూతి ప్రకటించడానికి చిలుకూరు బాలాజీ ఆలయానికి బార్లు తీరుతున్నారు. దుండగుల మీద చర్యలు తీసుకుంటానని ఆగమేఘాల మీద ప్రకటించిన ప్రభుత్వం వీరరాఘవరెడ్డితో సహా ఆరుగురిని అరెస్టు చేసింది.
కాని వీరరాఘవరెడ్డి-రంగరాజన్ ఘటన తెలంగాణ చరిత్రలో మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారి మీద, ముస్లింల మీద, క్రైస్తవుల మీద సంఘ్ పరివార్ మూకలు ఇటువంటి దాడులు నిరంతరం చేస్తూనే ఉన్నాయి. విష విద్వేష ప్రచారం సాగిస్తూనే ఉన్నాయి. హింసకు పురికొల్పుతూనే ఉన్నాయి. గత రెండు సంవత్సరాలలో తెలంగాణలోనే చెప్పుకోదగిన సంఘటనలు కనీసం ఇరవై జరిగాయి. బైట పడనివి, పత్రికలకు ఎక్కనివి, తూతూ మంత్రంగానైనా పోలీసులు కేసులు నమోదు చేయనివి డజన్లలో ఉంటాయి.
చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి మీద ఈ దాడికి ప్రత్యక్ష, పరోక్ష కారణాలేవో కనబడవచ్చు. కనబడని కారణాలూ ఉండవచ్చు. నిజానికి ఆ ఆలయం, అందులోనూ సౌందరరాజన్, రంగరాజన్ లు కూడా ఈ హిందుత్వ తానులోని ముక్కలే. హైదరాబాద్ శివారు గ్రామంలో, జంట జలాశయాల ఒడ్డున ఒకప్పటి గ్రామదేవత కట్ట మైసమ్మ గుడిని సౌందరరాజన్ ఎలా ఆక్రమించాడో, తమిళ మూలాలున్న ఆయన కుటుంబం హైదరాబాద్ లోని గుడికీ, ఆ గుడి కింద ఉన్నదని చెప్పబడుతున్న రెండు వందల ఎకరాల భూమికీ, ఆస్తికీ ఆనువంశిక ధర్మకర్త ఎలా అయ్యాడో తవ్వితీయవలసిందే. హుండీ, ఆర్జిత సేవలు ఉంటే ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని, ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తుంది గనుక అవి లేకుండా చేసిన తెలివైన వ్యక్తి ఆయన. ఆ గుడికి చట్టం వర్తించగూడదని, దాని నిర్వహణ భారత రాజ్యాంగానికీ, చట్టాలకూ లోబడేది కాదని, అది ‘‘తన’’ గుడి మాత్రమేనని సుప్రీం కోర్టు దాకా కొట్లాడి ఆ మినహాయింపు సాధించుకున్నాడు. పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే విదేశాలకు వెళ్లే వీసా వస్తుందని ఒక అభూత కల్పనను, మూఢ నమ్మకాన్ని, అంధ విశ్వాసాన్ని ప్రచారం చేసి, అలా వీసా వచ్చినవాళ్లు 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలని కట్టుకథల నిబంధనలు పుట్టించి వీసా బాలాజీగా తయారు చేశాడు. రామరాజ్య స్థాపనే తన ఆశయమని ఎన్నోసార్లు ప్రకటించాడు.
ఒకవైపు ఈ దారుణమైన మూఢ విశ్వాసాలను ప్రచారం చేస్తూనే, తండ్రీ కొడుకులు తమ ఉన్నత విద్య వల్ల పెద్ద మనుషులుగా, సంస్కారవంతులుగా పేరు తెచ్చుకున్నారు. మునివాహన సేవ పేరుతో దళితుడిని భుజాల మీద ఎక్కించుకుని, ఆలయంలోకి తీసుకువెళ్లి, తాము కుల వివక్షను పాటించేవారిమి కామని చూపుకోవడానికి ప్రయత్నించారు. ప్రగతిశీల అభిప్రాయాలు ఉన్నట్టు చూపుకున్నారు. ఈ ప్రగతిశీల భావాల వల్లనే వీరరాఘవరెడ్డికి కోపం వచ్చిందని, ఆలయ ఆస్తి మీద వీరరాఘవరెడ్డి కన్ను పడిందని, రామరాజ్యం సేన కోసం భారీగా నిధులు అడిగి, అవి ఇవ్వనందుకే ఇలా కసి తీర్చుకున్నాడని వేరువేరు కథనాలు వినిపిస్తున్నాయి.
‘‘మత విశ్వాసాలు ఉండడం, తమ తీరని సమస్యలను భగవంతుడు తీరుస్తాడని నమ్మి, పూజించడం వేరు. అవి వ్యక్తిగతమైనవి, ఆధ్యాత్మికమైనవి, సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించేవి. అటువంటి విశ్వాసాలు ఉండిన కోట్లాది ప్రజలతో వందల, వేల సంవత్సరాలుగా ఎటువంటి పెద్ద సమస్యలూ రాలేదు. కాని అమాయక ప్రజలలో ఉండిన ఆ మత విశ్వాసాలను మూఢత్వంగా, హేతు రహితంగా, పరమత ద్వేషంగా, హింసారాధనగా మార్చడం పూర్తిగా భిన్నమైనది. ఇది సామాజికం, రాజకీయం, ఆర్థిక స్వప్రయోజనాల కోసం పాలకవర్గాల ఉద్దేశపూర్వక వ్యూహం..’’
అంటే, ప్రజలలో ఉండే మత విశ్వాసాలను తమ స్వార్థ స్వప్రయోజనాలకు వాడుకోవడం, అత్యంత హేతు రహితమైన మూఢ విశ్వాసాలు వ్యాప్తి లోకి తేవడం వంటి పనులు చేసి, వేలాది మంది భక్తులను మాయ చేయడంలో చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి కుటుంబం ఇప్పటికే విజయాలు సాధించింది. ఇప్పుడు అవే పనులను వీరరాఘవరెడ్డి వారి మీద ప్రయోగించాడు. కాకపోతే పూజారి కుటుంబం దౌర్జన్యం చేసినట్టు కనిపించదు, వీరరాఘవరెడ్డి దౌర్జన్యం చేశాడు. ఆలయ పూజారులు చెప్పిన రామరాజ్య స్థాపన కోసమే తాను కూడా పని చేస్తున్నానని వీరరాఘవరెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి చెపుతున్నాడు. పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే వీసా వస్తుందని అబద్ధమూ, మూఢనమ్మకమూ ప్రచారం చేసినట్టే, ఒక కావ్య పాత్ర రాముడు నిజమైన ఇక్ష్వాకు వంశ వ్యక్తి అయినట్టు, తాను ఆ వంశస్తుడే అయినట్టు వీరరాఘవరెడ్డి అబద్ధ ప్రగల్భాలు పలుకుతున్నాడు.
వీరరాఘవరెడ్డిని ఇప్పుడు ఉన్మాదిలా, హేతు రహిత మూఢ విశ్వాసాలు ఉన్నవాడిలా చూస్తున్నారు గాని, తొమ్మిది సంవత్సరాలుగా రామరాజ్యం వెబ్ సైట్ నడుస్తున్నది. వీరరాఘవరెడ్డి భయంకరమైన వీడియోలు చేసి వదులుతున్నాడు. ‘‘ధర్మం కోసం, రామరాజ్య స్థాపన కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధం’’ అని తన శిష్యుల చేత ప్రతిజ్ఞలు చేయించి ఆ వీడియోలను బహిరంగంగా తన వెబ్ సైట్ మీద పెట్టాడు. ఈ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఆత్మహత్య అయినా, హత్య అయినా శిక్షార్హమైన నేరాలు. ఆ నేరాలు చేస్తాము అని ప్రతిజ్ఞలు చేయించేవాడు ఉన్మాది కాదు, మత మౌఢ్యం తలకెక్కిన మూరు?డు, నేరాలను రెచ్చగొట్టే నేరస్తుడు.
దేశంలో అత్యధికులు అటువంటి మత మౌఢ్యం తలకెక్కిన మూరు?లూ, హింసావాదులూ, నేరస్తులూ కావాలనేదే సంఘ్ పరివార్ కోరిక. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలలో నేర్పే కత్తి సాము, కర్ర సాము, ఇతర మత సమూహాల మీద చిమ్మే విషం, విద్వేషం కల్పించడానికి బోధించే తప్పుడు చరిత్ర సరిగ్గా అటువంటి మనుషులను తయారు చేసే కార్యక్రమమే. బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంఘ్ పరివార్ సంస్థలైతే ఆ విష విద్వేష ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లి కత్తుల, రివాల్వర్ల, మారణాయుధాల శిక్షణలు కూడా ఇస్తున్నాయి, ఆయుధాలతో బహిరంగ ప్రదర్శనలు చేస్తున్నాయి. ఇతర మతస్తుల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టి, హింసాకాండలు, మారణకాండలు సాగించి, సమాజాన్ని చీలదీసి, దాన్నే తమ రాజకీయ బలంగా మార్చుకోదలచాయి. నరేంద్ర దభోల్కర్, ఎం ఎం కల్బుర్గి, గోవింద పన్సారే, గౌరీ లంకేష్ లాంటి భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారిని హత్య చేసి సమాజంలో భయభీతావహం వ్యాపింపజేస్తున్నాయి. ఆ హత్యలు చేసిన నేరస్తులకు, హంతకులకు నీరాజనాలు పలుకుతున్నాయి.
మత విశ్వాసాలు ఉండడం, తమ తీరని సమస్యలను భగవంతుడు తీరుస్తాడని నమ్మి, పూజించడం వేరు. అవి వ్యక్తిగతమైనవి, ఆధ్యాత్మికమైనవి, సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించేవి. అటువంటి విశ్వాసాలు ఉండిన కోట్లాది ప్రజలతో వందల, వేల సంవత్సరాలుగా ఎటువంటి పెద్ద సమస్యలూ రాలేదు. కాని అమాయక ప్రజలలో ఉండిన ఆ మత విశ్వాసాలను మూఢత్వంగా, హేతు రహితంగా, పరమత ద్వేషంగా, హింసారాధనగా మార్చడం పూర్తిగా భిన్నమైనది. ఇది సామాజికం, రాజకీయం, ఆర్థిక స్వప్రయోజనాల కోసం పాలకవర్గాల ఉద్దేశపూర్వక వ్యూహం. సంఘ్ పరివార్ ఈ రాజకీయార్థిక వ్యూహాన్ని అనుసరిస్తూ గత వంద సంవత్సరాలుగా లెక్కలేనన్ని అనుబంధ సంస్థల సహాయంతో హిందూ మత విశ్వాసాలను వీథుల్లోకి తీసుకువచ్చింది. అమాయక హిందూ మతస్తులను హింసావాదులుగా, పరమత ద్వేషులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది. భారత సమాజంలో నెలకొని ఉన్న బహుళత్వాన్ని, సహజీవన సంస్కృతిని, ఆదాన ప్రదానాలను ధ్వంసం చేసి ఒక భయానకమైన అసహన, ద్వేష, హింసా సంస్కృతిని వ్యాపింపజేస్తున్నది. ఈ అసహన సంస్కృతి ఒక విష సర్పం. అది విస్తరించిన కొద్దీ పాము తన పిల్లలను తానే తిన్నట్టు తమ మత విశ్వాసాలు ఉన్నవారిలోనే కాస్త భిన్నాభిప్రాయం ఉన్నవారిని, ఒక మిల్లీ మీటర్ భిన్నంగా ఆలోచించేవారిని కూడా తినేస్తుంది. ఈ ఉన్మాదపు ప్రమాదాన్ని గుర్తించి, ఇది ఎంత సమాజ విధ్వంసకమో అర్థం చేసుకుని, అడుగడుగునా, ప్రతిక్షణం ఈ ఉన్మాదాన్ని అడ్డుకోకపోతే భారత సమాజపు మౌలిక స్వభావమే ధ్వంసమైపోతుంది. ఈ ఉన్మాదాన్ని ఖండించడం, ప్రతిఘటించడం ప్రతి ఒక్కరి బాధ్యత.