ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

– రాహుల్ ప్రధాని అయితేనే ఆ రాష్ట్రానికిì లబ్ది
– రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ
– మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమైనా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలని, ఓటు ఎవరికో వేసి దేవుడిని ఏదో అడిగితే ఎవరూ ఏం చేయలేరని అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై స్పందించారు. ’భక్తి అంటే నాది.. నేను రియల్ ఎస్టేట్‌లో సంపాదించిన డబ్బులతో సీతారాముల కల్యాణం చేస్తాను.. తెలంగాణలో ఒక్క బీజేపీ నేత అయినా నాలాగా చేస్తారా.. రాములవారి కల్యాణం చేసి నేనెప్పుడైనా ఓట్లు అడిగానా.. ఛత్రపతి శివాజీకి లేని మతం మీకెందుకు.. శివాజీ దగ్గర ముస్లింలు మంత్రులుగా పనిచేశారు.. బీజేపీ నేతలు చదువుకోవాలి.. ఆ పార్టీ వాళ్లు మాట్లాడితే హిందువులు అంటారు.. రాజ్యాంగాన్ని తీసేసే కుట్ర బీజేపీ చేస్తోంది.. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పాటుపడుతున్నారు.. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. దేశ ప్రజలకు కవచం లాంటిది రాజ్యాంగం.. కవచకుండలాలు ఉన్నంతకాలం కర్ణుడిని ఎవరూ చంపలేకపోయారు.. అవి దానం చేశాక కర్ణుడి ప్రాణాలు పోయాయి.. ఎన్నికల కమిషన్ ద్వారా ఓటు చోరీ చేసి కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఓట్లను దొంగిలించి ఎంపీ సీట్లు గెలిచింది.. దేవుడి పేరుతో, మతం పేరుతో, దొంగ ఓట్లతో ఆ పార్టీ గెలుస్తోంది.. దేశ ప్రజలు ఇప్పటికే ప్రమాదంలో ఉన్నారు.. రాజ్యాంగాన్ని తీసేస్తే మరింత ప్రమాదంలో పడతారు.. దేశం 67 ఏళ్ల పాలనలో రూ.54 లక్షల కోట్ల అప్పు చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1,047 లక్షల కోట్ల అప్పులు చేసింది. రాహుల్ కుటుంబం అధికారం కోసం ఏనాడూ తాపత్రయపడలేదు. ఆయనది ఆస్తులు, ప్రాణత్యాగం చేసిన కుటుంబం. ప్రధాని పదవిని రాహుల్ త్యాగం చేశారు. అధికారం చేపట్టిన తర్వాత మోదీ చేసిన మంచి ఒక్కటి చెప్పండి’ అని జగ్గారెడ్డి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *