– పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్
– కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల తనిఖీ
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : వరంగల్ జిల్లాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమల పురోగతికి అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ అధికారులకు సూచించారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఆయన గురువారం సందర్శించారు. పార్కులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్, యంగ్వన్, గణేశా కంపెనీలను ంగా తనిఖీ చేశారు. ఆయా పరిశ్రమల్లోని ఉత్పత్తి కార్యకలాపాలు, పనితీరును పరిశీలించి, సంబంధిత అంశాలపై అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ముచ్చటించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వరంగల్ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించాలని, స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను పెంపొందించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన ప్రతిపాదనలతో ముందుకు రావాలని అధికారులను ఆయన ఆదేశించారు. వస్త్ర పరిశ్రమ రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానికంగా పరిశ్రమల విస్తరణకు, ఈ ప్రాంత ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి పరిశ్రమలకు అవసరమైన సహకారాన్ని సకాలంలో అందించాలని సబ్యసాచి ఘోష్ సూచించారు. కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్.కిషోర్ కుమార్, చేనేత, వస్త్ర శాఖ అదనపు సంచాలకుడు ఎన్.వెంకటేశ్వరరావు, ఏడీ శ్రీకాంత్ రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, నారాయణరెడ్డి, టీటీడీవో, సంగెం తహసీల్దార్ జి.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





