– ఏళ్లతరబడి తిష్ఠ వేసిన అధికారులను బదిలీ చేస్తాం
– 2018 నుంచి క్లెయిమ్‌లపై సమగ్ర విజిలెన్స్ విచారణ
– నా సిఫారసు లేఖతో క్లెయిమ్ మంజూరైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవం
– శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : కార్మికుల సంక్షేమ నిధులను పరిరక్షించడంతోపాటు పారదర్శకతే లక్ష్యంగా కార్మిక శాఖలో సమూల ప్రక్షాళన చేపట్టనున్నట్లు శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను ప్రక్షాళన చేయడంతోపాటు ఏళ్లతరబడి ఒకేచోట తిష్ఠవేసిన అధికారులను త్వరలోనే బదిలీ చేస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి రూపాయి సక్రమంగా వినియోగమయ్యేలా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందిస్తామన్నారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కార్మిక శాఖలో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన వెంటనే జాయింట్ లేబర్ కమిషనర్ స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపి ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నామని, సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించామని వివరించారు. విచారణలో ఎవరిపాత్ర బయటపడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోగస్ పత్రాలు, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అక్రమంగా క్లెయిమ్‌లు పొందినట్లు ఆరోపణలు రావడంతో 2018 నుంచి ఇప్పటివరకు నమోదైన అన్ని క్లెయిమ్‌లను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. బోర్డులోని విధానాలను సమీక్షించి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రక్రియలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. వివిధ సంస్థలు, నిర్మాణదారుల నుంచి వసూలు కావాల్సిన రూ.వందల కోట్ల లేబర్ సెస్సును నిబంధనల ప్రకారం పెనాల్టీలతో వసూలు చేస్తామని వెల్లడించారు. తన సిఫారసు లేఖ ఆధారంగా కార్మికుల పరిహార క్లెయిమ్ మంజూరైనట్లు ఒక పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. తన వద్దకు వచ్చిన దరఖాస్తుపై నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచించానని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అధికారులు దరఖాస్తును తిరస్కరించారని, దరఖాస్తుదారుడికి ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించలేదని స్పష్టం చేశారు. చెల్లింపే జరగనప్పుడు తన సిఫారసుతో క్లెయిమ్ మంజూరైనట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.
సింగరేణిపై బీఆర్ఎస్ ఆరోపణలు విడ్డూరం
సింగరేణి పరిస్థితిపై బీఆరఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య లక్ష నుంచి 38 వేలకు పడిపోయిందన్నారు. ఆ పదేళ్లలో ఒక్క కొత్త బొగ్గు గని కూడా సంస్థకు రాలేదన్నారు. బొగ్గు గనుల వేలం చట్టానికి పార్లమెంటులో అనుకూలంగా ఓటేసింది ఆ పార్టీ ఎంపీలేనని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయించే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వేలంలో పాల్గొని ఆర్కేఓసీ మైన్, తాడిచర్లలో మరో గనిని సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొత్త గనుల ఏర్పాటు ద్వారా బొగ్గు ఉత్పత్తి పెరగడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ విస్తరణకు అవసరమైన నిధులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించడం సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమేనని వివరించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుకు దక్కాల్సిన డీఎంఎఫ్టీ నిధులను బీఆరఎస్ పాలనలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించారని మంత్రి ఆరోపించారు. బొగ్గు గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదన్నారు. సింగరేణిపై గత ప్రభుత్వం బకాయిల భారాన్ని మోపిందని, కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. సంస్థ ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేస్తూ భవిష్యత్తులో పోటీని తట్టుకునేలా పెట్టుబడులు పెట్టడం ప్రస్తుత ప్రభుత్వ విధానమని మంత్రి వెంకటస్వామి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





