– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగస్వాములు కావాలి
– విజన్-2047 లక్ష్యాల సాధనలో ఆటోమొబైల్, ఈవీ రంగాలు కీలకం
– కాలుష్య రహిత తెలంగాణ లక్ష్యంతో ఈవీ పాలసీ అమలు
– రవాణా శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో భాగంగా ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) రంగాలకు సంబంధించి సచివాలయంలో బుధవారం నిర్వహించిన తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఆటోమొబైల్, ఈవీ రంగాల ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ తయారీ, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగాల్లో భారీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు తమ పరిశ్రమలను మరింత విస్తరించడంతోపాటు కొత్త పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు.
ఈవీ పాలసీతో కాలుష్య రహిత తెలంగాణకు అడుగులు
రాష్ట్రాన్ని కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితమే దేశంలో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈవీ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు కల్పించామని పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాల ఫలితంగా గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 2,17,690 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, తద్వారా సుమారు రూ.2,343 కోట్ల మేర పన్ను మినహాయింపులు కల్పించామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
పరిశ్రమలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు
ఆటోమొబైల్, మొబిలిటీ రంగాల అభివృద్ధికి మూడు పారిశ్రామిక పార్కులు, మొబిలిటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌తోపాటు ఎంకతల, కొడంగల్ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. ఈ పార్కుల్లో పరిశ్రమలకు అవసరమైన భూమి, ల్యాబ్ సదుపాయాలు, మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీ, ఇతర పారిశ్రామిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, విధానపరమైన సహకారం, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, అమర రాజా, ఒలెక్ట్రా, బిలిటి ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ, బాష్, జెడ్ఎఫ్, ఎంఆర్ఎఫ్ వంటి ప్రముఖ సంస్థలు పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వినియోగించుకొని ఆటోమొబైల్ తయారీ, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ స్టోరేజ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
గ్లోబల్ సమ్మిట్-2026 విజయవంతంలో భాగస్వాములు కావాలి
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను విజయవంతం చేయడంలో పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని, ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయని, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి ఇలంబర్తి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి నిఖిల్ చక్రవర్తి, జేటీసీ వెంకట రమణ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కన్వీనర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఔజాద్ షేక్ తదితర అధికారులు పాల్గొన్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఏథర్, బాష్, జెడఎఫ్, టాఫే, జియో బీపీ, ఏవీఎల్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో కలిపి సుమారు 25మంది పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రమోద్ ఛాబ్రియా ఆర్.ఏ.పీ.మోటార్స్, రాణి శ్రీనివాస్-జీరో 21 గ్రూప్, శ్రీకాంత రెడ్డి-హోలా మొబిలిటీ, కృష్ణ-బీవీఆర్బీ, అర్షద్ ఖాన్ పఠాన్-బాష్, గోపాలకృష్ణన్ వి.సి.- మహీంద్రా, భరత్ ఎం.-అడాప్ట్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్ శివలెంక-ఈవ్జిప్ మొబిలిటీ, ప్రొఫెసర్ అమల్య-ఏఎస్సీఐ, ప్రొఫెసర్ రాజ్‌కిరణ్ – ఏఎస్సీఐ, సిరాజుద్దీన్ బాబుల్ఖాన్- వైబ్రంట్ మొబిలిటీ గ్రూప్, రాజాజి-బీటీఎల్ ఎలక్ట్రిక్ కంపెనీలు, ప్రతినిధులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





