ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ సమ్మిట్-2

– దావోస్ తరహాలో ప్రపంచ విధాన చర్చలకు హైదరాబాద్ వేదిక
– అహింస, అలీన విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలే ప్రపంచానికి మార్గదర్శకాలు
– రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి చర్చలు
– ఈనెల 13, 14న హైదరాబాదులో భారత్ సమ్మిట్-2026 నిర్వహణ
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్-2026తో రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రపంచానికి దిశానిర్దేశం చేసే అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్ ఎదగనుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ఈనెల 13, 14 తేదీల్లో భారత్ సమ్మిట్-2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రపంచానికి నూతన దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తోందన్నారు. హైటెక్స్‌లోని ఓ హోట‌ల్‌లో భారత్ సమ్మిట్-2 విజయవంతం కోసం బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 70కిపైగా దేశాల నుంచి వెయ్యిమందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారని వెల్లడించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో, జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

ప్రపంచానికి గాంధీ, నెహ్రూ విధానాలు అవసరం

మహాత్మా గాంధీ బోధించిన అహింసా సిద్ధాంతం, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరమని పేర్కొన్నారు. కొన్ని అగ్రరాజ్యాలకు అనుగుణంగా వ్యవహరించే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వతంత్ర గుర్తింపును, అస్తిత్వాన్ని కోల్పోకూడదన్నదే నెహ్రూ ఆలోచన అని చెప్పారు. భారతదేశం స్వశక్తితో ఎదగడమే కాకుండా ప్రపంచంలోని ప్రగతిశీల, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహించాలన్న ఆయన దూరదృష్టి దేశానికి బలమైన పునాదులు వేసిందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, ఇతర ఆర్థిక విధానాలు దేశాన్ని బలోపేతం చేశాయని, నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు రావడంలో నెహ్రూ విధానాల పాత్ర కీలకమని వివరించారు.

ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి మరో కీలక స్తంభం

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉన్నట్లే ప్రతిపక్షం కూడా ఉండాలని, ఈ రెండూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రెండు కీలక స్తంభాలని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష పార్టీలను, నాయకులను శత్రువులుగా చూడకూడదని, కేవలం తమతో విభేదించే రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలని సూచించారు. ప్రతిపక్షాల ఆలోచనలు, విధానాలను వ్యతిరేకించవచ్చును తప్ప వారిని శత్రువులుగా పరిగణించడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిపక్ష పార్టీలను శత్రువులుగా చూస్తున్నారని, వాటిని, వాటి నాయకత్వాన్ని రాజకీయంగా అంతం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో అధికార, ప్రతిపక్షాలు రెండూ సమర్థవంతంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను బలంగా విశ్వసిస్తుందని, ఈ అంశాలపై చర్చించేందుకు అన్ని పార్టీలను, నాయకులను భారత్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలి

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం అత్యంత ప్రాథమికమైన రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారానే ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం పొందుతారని చెప్పారు. అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. రాహుల్ గాంధీ నుంచి క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వరకు ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఓటు హక్కుల కోసమే తాము పోరాడటం లేదని, దేశంలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రతి పౌరుడి తరఫున మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కువమంది ఓటర్లను తొలగించడం కాకుండా ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల కమిషన్, ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలని అన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌ఛార్జి గురుదీప్ సింగ్ సప్పల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సమృద్ధ భారత్ ఫౌండేషన్ డైరెక్టర్ పుష్పరాజ్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *