– విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు
– బోధన సిబ్బంది ప్రయోజనాలకు భంగం కలగనివ్వం
– విద్యా సంస్థల్లో మౌలిక వసతులకు పెద్దపీట
– యూనివర్సిటీ బోధనా సిబ్బంది నియామకాల ప్రక్రియ వేగవంతం
– విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యమైన విద్యా బోధన ద్వారా, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విద్యా శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న ప్రగతిని అధికారులు వివరించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. 12వ తరగతి వరకు విద్యార్థులను భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. 12వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకుని అందులో నిపుణులుగా మారేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలన్నారు. పదో తరగతి తర్వాత సగటున 40 శాతం మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, అందులో అత్యధికులు బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలే ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 12వ తరగతి వరకు కొనసాగింపు ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా స్వల్పంగా ఉంటోందన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ తరగతి విధానమే అమల్లో ఉందన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్మెంట్ బెనిఫిట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదన్నారు. ఆయా వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూళ్లను పూర్తి వసతులతో నిర్మించడానికి అవసరమైన కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణాలకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలని, వాటికి పూర్తిస్థాయిలో నీటి వసతి కల్పించాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





