– రాహుల్ రాద్ధాంత రాజకీయాలకు భారత్ తిరస్కారం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూదిల్లీ, అక్టోబర్ 9 : వివిధ రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవలేకపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీజేపీ-ఎన్డీయే నాలుగు స్థానాల్లో విజయం సాధించిందన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానాన్ని 2024లో కాంగ్రెస్ గెలుచుకోగా ఇప్పుడు అదే స్థానంలో ఓట్ల శాతం రెండంకెలకు కూడా చేరకపోగా ఏఐయÖడీఎఫ్ కంటే వెనుకబడి మూడో స్థానానికి పడిపోయిందన్నారు. దేశాన్ని పాలించాలని కలలు కంటున్న పార్టీ తాను గెలిచిన స్థానంలో రెండేళ్ల వ్యవధిలోనే డిపాజిట్ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకుని మరీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా బీజేపీ 1.22 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచిందన్నారు. దిల్లీలో వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు సున్నా అని, బిహార్‌లో 23 జిల్లాల్లో యాత్ర చేసినా 61 స్థానాల్లో పోటీ చేసి గెలిచింది కేవలం ఆరు సీట్లేనని, బెంగాల్లో 294 స్థానాలకు గాను గెలిచింది రెండే, ఏపీలో 175 పోటీ చేస్తే గెలిచింది సున్నా అని తెలిపారు. ఇలా రెండు దశాబ్దాల్లో ఇప్పటివరకు 99 ఓటములు మూటగట్టుకున్నారు. ఓటముల సెంచరీకి రాహుల్ గాంధీ కేవలం అడుగు దూరంలోనే ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాస్తవాలను గుర్తించి తన తప్పుడు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. యÖపీలో 1989 నుంచి, బిహార్‌లో 1990 నుంచి, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి, గుజరాత్లో 1998 నుంచి, ఏపీలో 2014 నుంచి కాంగ్రెస్‌ను ప్రజలు అధికారానికి దూరంగా ఉంచారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ప్రజల నుంచి స్పందనే లేదని, ఓడిపోయిన ప్రతిసారీ ఈవీఎంలదే తప్పు.. ఎన్నికల సంఘానిదే తప్పు.. ఓటర్ల జాబితాదే తప్పు.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌దే తప్పు అని సాకులు వెతుక్కోవడానికే సరిపోతోందని అన్నారు. తాను అనుసరిస్తున్న దేశ, సమాజ, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని అర్థం చేసుకోలేక రాజ్యాంగబద్ధ సంస్థలపై రాహుల్ దుమ్మెత్తి పోస్తున్నాడని విమర్శించారు. భారత్‌లో ఓట్ చోరీ లేనే లేదు.. ఉన్నదల్లా ఓట్ దూరీ మాత్రమే అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పనిచేసే నీతివంతమైన ప్రభుత్వాన్ని, ఫలితాలు చూపించే ప్రభుత్వాన్ని, సమర్థ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ప్రజలకు అందుతున్నది అదే అని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




