త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

– పారదర్శకంగా, వివాదరహితంగా బోర్డు నిర్వ‌హ‌ణ‌
– అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు
– సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
– మంచిర్యాలలో నేడు 335మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారని చెప్పారు. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. మెడికల్ బోర్డు ద్వారా అర్హులైన ఉద్యోగులకే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందంటూ మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు సూచించారు. ఇటీవలి వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335మంది వారసులకు మంచిర్యాలలో శనివారం(13న) జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిరు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశం తమ దృష్టిలో ఉందన్నారు. దీన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు, న్యాయపరమైన సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ సింగరేణి

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వివరించారు. సింగరేణిలో 2,657 పోస్టులను భర్తీ చేశామన్నారు. వీటిలో 555 ఎక్సటర్నల్ పోస్టులు ఉండగా 2,102 కారుణ్య నియామక ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రత్యక్ష ఉద్యోగాల భర్తీని కూడా ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టి వివాదరహితంగా అర్హులందరికీ ఉద్యోగాలు కల్పించామన్నారు. కారుణ్య నియామకాల కోసం ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 35 నుండి 40 సంవత్సరాలకు పెంచడం ద్వారా మరింతమంది అర్హులకు అవకాశం కల్పించామని తెలిపారు. ఇప్పటికే 200మంది లబ్ధి పొందారని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగులకు భరోసా కల్పించేలా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఇదేకాక బ్యాంకులతో సంప్రదింపులు జరిపి ఇటీవలే ఉద్యోగులకు రూ.10 లక్షల ఉచిత సహజ బీమా సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.40 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించామన్నారు. గత రెండేళ్లలో రూ.1500 కోట్లను లాభాల వాటా రూపేణా చెల్లించినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఉద్యోగికి అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో అన్ని ఏరియా హాస్పిటల్స్ ఆధునికీకరణకు చర్యలు తీసుకోవడమేకాక గోదావరిఖనిలో క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, డిపెండెంట్ పిల్లల వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా సింగరేణి కార్మికుల కష్టాలు, సమస్యలను ప్రత్యక్షంగా చూసినట్లు గుర్తు చేసుకున్నారు. అందువల్ల సింగరేణి కార్మికులతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా సింగరేణి బహుముఖంగా విస్తరించేందుకు, కొత్త బొగ్గు బ్లాకులు సాధించేందుకు, తద్వారా ఉద్యోగుల వారసులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతాయన్నారు. ఒడిశా నైనీ బ్లాక్ అనుమతులతోపాటు బొగ్గు ఉత్పత్తికి తీసుకున్న ప్రత్యేక చొరవను గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ సంస్థను విస్తరించే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *