– చర్యలు లేనందునే గ్లోబరీనా అక్రమాలు సీబీఎస్‌ఈకి విస్తరణ
– కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రశ్న పత్రాల లీకేజీలకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు లేవని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అనుమతి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడానికి వేదికలుగా మారుతున్నాయని విమర్శించారు. ఈ విషయంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సీఎం సూచించారు. విద్యను వీలైనంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం తక్కువగా ఉంటుందని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని చూసి తర్వాత రాష్ట్రంలో ఏం చేయాలనేది ఆలోచిస్తామని సీఎం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని చెప్పారు. విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్లోబరీనా వటి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు సీబీఎస్‌ఈ పరీక్షల వరకు విస్తరించి వాటిని గందరగోళం చేశారని సీఎం విమర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి పనుల విషయంలో సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పరిస్థితుల పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం రూ.8వేల కోట్ల బకాయిలు పెట్టిపోయిందంటూ ఎలాంటి వసతులు లేకుండా, దొంగ లెక్కలు చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కొట్టేయాలనుకునే సంస్థలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోందని సీఎం తెలిపారు. సక్రమంగా ఉన్న వాళ్లకు బకాయిలు చెల్లిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కేసీఆర్ పెట్టిన బకాయిలే తమకు భారంగా మారాయన్నారు. తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నట్లుగా, తమ ప్రభుత్వం కారణమన్నట్లుగా బీఆర్‌ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందని, దానికి బీజేపీ వంతపాడుతోందని సీఎం మండిపడ్డారు. ఏపీలో ఫీజు బకాయిలపై బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయించిన తర్వాత తెలంగాణలో డిమాండ్ చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కృష్ణయ్యలకు సూచిస్తున్నామన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామని, అడ్వాన్స్‌డ్‌గా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఏటా రూ.2,200 నుంచి రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమవుతాయన్నారు. క్రమం తప్పకుండా వాటిని చెల్లించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచించుకుందని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండదని సీఎం స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్క్‌లను కబ్జాలు పెట్టుకున్నోళ్లు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్‌కుమార్ మీద 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులున్నాయని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.
సాంకేతిక పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం 

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికా (సీఓఓ) నాగ భరత్ డాకా దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వ-ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజయం దేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ప్రశంసించారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




