ఆహా!మాటలెంత మధురమో!? 

 తెలంగాణా అక్క పగటికల చెదిరి నట్లుంది ఎదురుగా తెలంగాణా ఖజానా లాగా తూలుతూ, సోలుతూ వస్తున్న తాగొచ్చిన భర్తను చూసి కోటీశ్వరుల మాట దేవుడెరుగు ఉన్న కొంప గోడు ఊడ్చి పారేస్తున్న సారా కొట్టు సంగతేమిటో ముందు తేల్చిపారేయ్, బెల్టుషాపులు మూసెయ్యండి.. అయ్యబాబోయ్? నా భర్త తాగితగలేసిన డబ్బుతో నన్నుకోటీశ్వరాలిని చేస్తారా?ఇదేం వైనం అమ్మా..ఈ నడమంత్రపు సిరి నాకొద్దులే బాబోయ్,అంటూ పగటి కలవిడిచి ఒక్క గెంతుతో మళ్ళీ వంటగదిలోకి ఎప్పటి మాదిరిగా ఉడాయించింది..  
ఎన్.తిర్మల్,
(రచయిత, సామాజిక కార్యకర్త)
సెల్:9441864514

చిలకపచ్చ కలనేత చీరెకు కలంకారీ పువ్వులు అద్దితే ఎంత సొగసుగా ఉంటాయో! అవి పంపిణీ చేసే మంత్రుల మాటలు అంత మధురంగా  ఉంటాయి.అసలు మంత్రులంటేనే మాటలు మంత్రాంగం నడిపేవారు అని అర్థం.పరిపూర్ణార్థంలో మాటలు మాంత్రికులు. మహిళల చీరెలు,సారెలు, బంగారం సెంటిమెంట్ ఇట్టే పట్టేసినట్టున్నారు.మహిళల హస్తవాసిని వోట్లకు సింగారించుకోవడంలో మన కాంగ్రెస్ మంత్రులు అందరికంటే ఓ అడుగు ముందే ఉన్నారు.మహిళా కనికట్టు ఇట్టే పట్టేసుకున్నారు.మాటల మంత్రాలను సమ్మోహనాస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు.అవునన్న కాదన్నా ఎన్నికల తాయిలాల్లో ఇదో సరికొత్త రాజకీయ విద్యనే! ఈ రాజకీయ నాయకులు ఏ అబద్దాల యూనివర్సిటీ లో ఈ మాటల’కలంకారీ’ విద్య నేర్చుకొంటారోగాని చిలుక కంటే అందమైన మాటలతో జనాలను మభ్య పెట్టగలరు.

     ఇందిరమ్మ చౌక చిలక పచ్చ చీర పంపిణీ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పలికిన పలుకులు “ఆహా మాటలెంతమధురమో!?”అన్నట్లు అదరగొట్టేశారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట!ఇక మహిళలకు సూపర్ మార్కెట్లు , పెట్రోల్ బంకులు వ్యాపార రహస్యాలు విప్పేశారు.అంతేకాదు, అందుకు అవసరమైన భూములు సరసమైన ధరలకు ఇచ్చేస్తారట! ఆ పేరుతో రాజధాని వెలుపల భూములు పై ఎంచక్కా భూ రహస్యాలు ఇట్టే ఆపోసన పట్టేస్సారు! తమతోపాటు కార్యకర్తలను బలోపేతం చేయాలి కదా!ఓహో,ఈ పథకం వెనుక మతలాబు కాస్తా ఓ మోస్తారు పెద్దదే! ప్రక్కనే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క,మరోపక్క మహిళా అబివృద్ధి మంత్రి సీతక్క ఎంచక్కా చప్పట్లు కొట్టేశారు.ఏమండోయ్!ఈ తియ్యటి ఊరించే మాటల చెలిమలు తవ్వడం లో మల్లు భట్టి విక్రమార్క గారికి మంచి డిగ్రీనే ఉంది.
   ఇలాగే ఇందిరమ్మ కొడుకు రాజీవ్ పేరుతో యువతను ఉరికించి,ఊరించి”రాజీవ్ యువశక్తి పధకం”అనిచెప్పి దరఖాస్తుల తిరుణాల ఏర్పాటు చేస్తే 16 లక్షల మంది యువత పారిశ్రామిక వేత్తలు,వ్యాపార వేత్తలు గా కలగన్నారు.మీసేవల చుట్టూ, బ్యాంకుల చుట్టూ నిరుద్యోగులు చీమల్ల బారులుతీరారు.శిక్షణలు, శిబిరాలు అంటూ హడావిడి చేశారు.”చిటారుకొమ్మన మిఠాయి పొట్లంలాగా ఊరించారు”.ఉరికించారు. చివరకు ఏమైందో ఏమో,ఆ సబ్సిడీపధకం మాట మళ్ళీ ముఖ్యమంత్రి నోట లేదా భట్టి  మాట గానైనా వినిపించడం లేదు.
     మంత్రుల మాటల్లో అర్థాలే వేరులే.ఇక మహిళలను కోటీశ్వరులు చేయడం మంచిదే,కానీ, దానికి బడ్జెట్ లో ఎన్ని వేల కోట్లు కేటాయించారు చెప్పనేలేదు.ఇకపోతే భట్టీ  గారి పాదయాత్ర సందర్భంగా దారి పొడుగునా అనేక తియ్యటి మాటలు చెప్పారు.ముఖ్యమంత్రి ఎజెండా పరిపూర్ణం అయితే తప్ప వాటికి మోక్షం లేదేమో?అవి ఏమయ్యయో! ఇప్పుడు చాలాకాలం అయ్యింది కనుక గుర్తుండక పోవచ్చును.కానీ, పాదయాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ తో హిందీ భాషలో చెప్పించిన వాగ్దానం ఇంటర్ పూర్తిచేసిన ఆడబిడ్డలకు ఉచిత స్కూటీల పంపిణీ మాట నిలబెట్టుకునే ఆలోచన ఉందా లేదా? నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి మాట మరిచారా?అంతేకాదు, ఎన్నికల్లో మహిళలను మరీమరీ ఊరించి,ఉరికించి చేతి ఖర్చుల క్రింద నెలనెలా ఇస్తామన్న 2500/-రూపాయల’ మహాలక్మిపధకం ‘ఊసే లేదు. ఆరుగ్యారెంటీల మాటలో ఇదో మదుపు మాటగానే మిగిలింది. గర్బిణీస్త్రీలకు కేసీఆర్ కిట్టు ఫట్!ఇక కళ్యాణలక్ష్మి పథకం లబ్దిదారులకు హస్తం నేతలు మంచి హస్త వాసినే ప్రకటించారు.
    మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో పదేపదే చెప్పారు.మా తెలంగాణా ఆడబిడ్డలకు పెళ్ళి చేసి ఉత్తి చేతులతో పంపిస్తామా ఏమిటి? .పంపితే ఏం లాభం!పెండ్లి అంటే నూరేళ్ళ పంట!పసిడి పంట,ఆ పంటకు మా సెంటిమెంటల్ వంట ఎందుకు జతచెయ్య గూడదు అనుకున్నారో ఏమో! బంగారం సెంటిమెంట్ మహిళల దగ్గర బంగారం లా పండుతుందని కాంగ్రెస్ వారికి తెలిసినట్లు మరెవరికీ తెలియదుమరి.అందుకే హస్తవాసులు వెంటనే వోట్లు హస్తవాసిని ప్రకటించేశారు. అరక్షణంలో అరచేతిలో గీతలు మార్చేశారు.మా ఆడబిడ్డల పెళ్ళికి కళ్యాణలక్మి ఆర్థిక సహాయం తోపాటు తులం మెలిమి బంగారం గిఫ్టుగా ప్రకటించేశారు.బంగారం మాటలైతే భలే మెరిసిపోయాయి కానీ,ఆచరణ కొచ్చేసరికి బంగారం కాస్తా కాకి బంగారం అయి కూర్చుంది.ఆడబిడ్డల హస్తవాసి సంగతేమో!కానీ, తులం బంగారం రేటు 60 వేల రూపాయల నుండి అమాంతం మూడు రెట్లు పెరిగిపోయింది.అయినా ఎవరివ్వొద్దన్నారు. ఒకవేళ ఎవరైనా గట్టిగాఅడిగితే! గిడిగితే!! మేం కొనివ్వలనుకున్నాం. మన ప్రధాని  మోదీ  ఉన్నాడు చూశారా?ఆయనే బంగారం అసలు కొనొద్దు అన్నాడు.కనుక ప్రతిపక్షంలో ఉన్న ప్రధాని ప్రధానేగా కనుక ఆయన గౌరవార్థం వాయిదా వేస్తున్నాం అని ప్రకటించినా ఆశ్చర్యం లేదు? ఎందుకంటే ఈ మద్య మన మోదీ  మాటామంతీ మనకు కాస్తా ఇంపేకదా!ఇనసొంపేకదా?
     కాంగ్రెస్ వాగ్దానాల కనికట్టులో ఉచిత బస్ సౌకర్యం ఒకటి ఆటంకం లేకుండా నడుస్తోంది.పోనీలే అదైనా ఆగుకుంటా , బ్రేక్ వేసుకుంటా పోయో పల్లె వెలుగు బస్సులాగా పథకం లాగుకెళుతుంది. కనుక వచ్చే ఎన్నికల్లో కాలం కలిసి వస్తే రైళ్ళు,విమానాల్లో ఓసారి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అనబడే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదు.ఎందుకంటే ఎవరికి మాత్రం జీవితంలో ఒక్కసారైనా గాలిమోటరు ఎక్కాలని ఉండదు.పోనీలే ఈ విషయాన్ని మేనిఫెస్టో కమిటీ కోసం అట్టి పెడదాం.అదిసరే.ఏది ఎలా ఉన్నా మన కాంగ్రెస్ పార్టీ కి మహిళలు నైనా!వాళ్ళ వోట్లన్నా!! ఎందుకు అంతిష్టం. బంగారం, చీరెలు మీద ఉన్న మమకారం భలే ఒడిసిపట్టుకున్నారులే! కుడుమిస్తే పండుగనే మన ఆడబిడ్డల నాడి కాంగ్రెస్ వాళ్ళు ఇట్టే పట్టేసుకున్నట్టు ఉన్నారు.
    ఇక గత ఏడాది ఇట్టే ఆడబిడ్డలకు సారే చీర అనిచెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభం చేసినప్పటికీ,ఎదురుచూపులు తప్ప,ఎవరి చేతికెళ్ళాయో చీరెలు,సారెలు అర్థంకాని అయోమయం.మన మంత్రివర్యుల మాటలు ఎంత మధురమో కదా! ఆచరణ అంత సుదూరమే!! మన మంత్రివర్యులు మాటలను అందమైన శిల్పాల్లా తీర్చిదిద్దగల మాయురశిల్పులే? అయ్యో!ఈసారి చిలక పచ్చ జరీఅంచు చీరె,సారె,దాచుకొని,దోచుకొనే పిల్ల ముఠాలను దాటి తనదాకా వస్తుందో లేదో ? అమ్మలక్కల్లో అనుమానం గూడు కట్టుకుంది.చీరేసారేమోగాని మా ఇల్లు ఒళ్ళు గుల్ల చేస్తున్న వీధికో డజను బెల్టుషాపులు రేవంత్ అన్నమాట ప్రకారం మూయిస్తారా! లేదా,ఒంటరి మహిళల ఆసరా పెంపుదల ఏమైంది?
   పెంపుదల సంగతి దేవుడెరుగు ఇంతవరకు దరఖాస్తు చేసుకున్న వికలాంగ అక్కలు కొత్త పెన్షన్ల కథ ఏమిటి? హైడ్రా గురించి ముఖ్యమంత్రి ఏకంగా హిట్లర్ ముచ్చటచెప్పి నాలిక కరుచుకునే! మరో మంత్రి శ్రీహరి తెరుస్తామన్న పబ్లిక్ స్కూల్స్ సంగతేమో!కానీ బడిలో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామంటున్నరు. మరో మంత్రి బొందితో కైలాసం పంపిస్తానంటడు.ఒక మంత్రమో పగలే చుక్కలు చూపిస్తామంటరు.గిట్లుంది కాంగ్రెస్ వారి కహానీలు తీరు? అంతలోనే, తెలంగాణా అక్క పగటికల చెదిరి నట్లుంది ఎదురుగా తెలంగాణా ఖజానా లాగా తూలుతూ, సోలుతూ వస్తున్న తాగొచ్చిన భర్తను చూసి కోటీశ్వరుల మాట దేవుడెరుగు ఉన్న కొంప గోడు ఊడ్చిపారేస్తున్న సారా కొట్టు సంగతేమిటో ముందు తేల్చిపారేయ్, బెల్టుషాపులు మూసెయ్యండి.. అయ్యబాబోయ్? నా భర్త తాగితగలేసిన డబ్బుతో నన్నుకోటీశ్వరాలిని చేస్తారా?ఇదేం వైనం అమ్మా.ఈ నడమంత్రపు సిరి నాకొద్దులే బాబోయ్,అంటూ పగటి కలవిడిచి ఒక్క గెంతుతో మళ్ళీ వంటగదిలోకి ఎప్పటి మాదిరిగా ఉడాయించింది సగటు తెలంగాణా అక్క!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *