ఉపాధ్యాయుల వోటును నోటుతో కొనడమా..?

ప్రమాదంలో చైతన్యవంతమైన వోటు…!

రాజ్యాంగ తొలి ముసా యిదాలో శాసన మం డలి గురించి ప్రస్తా వించడం జరి గింది. బి.ఎన్‌.‌రావు తొలి రచన చేసి అంబేడ్కర్‌ ‌సారథ్యంలోని ముసా యిదా కమిటీ తుది రూపం ఇచ్చిన రాజ్యాంగ ముసాయిదాలోనూ శాసన మండలి ప్రస్తావన ఉంది. అయితే ముసాయిదాలో అధ్యాపకులకు, మేధావి వర్గానికి పెద్దపీట వేయలేదు. శాసనమండలిలో కొన్ని సీట్లను పంచాయతీ సంస్థల నుంచి,  అసెంబ్లీ స్థాయి దాకా ఎన్నికైనవారు ఎన్నుకుంటారని, రాష్ట్ర గవర్నర్‌ ‌నియామకం ద్వారా మరికొన్ని నింపుతారని మాత్రమే ముసాయిదాలో పేర్కొన్నారు. మిగిలిన సీట్ల ఎన్నిక, ఎంపిక ఏ విధంగా జరుగుతుందో అందులో చెప్పలేదు. కానీ ఎవరిని ఎంపిక చేయాలో మాత్రం సూచించారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్యారంగం, కార్మిక రంగం, సాంకేతిక రంగం, కళా రంగం, సాహిత్య రంగం మొదలైన సకల సామాజిక రంగాల్లో సన్నిహిత పరిచయం ఉన్న నిపుణులు ఎన్నుకోవాలని పేర్కొన్నారు.

వివిధ సామాజిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారు శాసనమండలికి ఎన్నికైతే శాసనసభ చేసే చట్టాలను పర్యవేక్షించి సలహాలు, సూచనలు ఇవ్వడం మేధోవంతంగా ఉంటుందని మేధావుల కోసం రాజ్యాంగ నిపుణులు ఆలోచన చేశారు. కానీ రాజ్యాంగానికి సంపూర్ణమైన రూపం ఇచ్చే నాటికి ఈ విధానం మారిపోయింది. ఎవరిని ఎన్నుకోవాలనే అంశాన్ని తీసివేసి.. ఎవరు ఎన్నుకుంటారనేది చేర్చడం జరిగింది. ఈ సందర్భంలో పంచాయతీ,  అసెంబ్లీకి ఎన్నికైన వారికి వోటు కల్పించడంతోపాటు పట్టభద్రులకు,ఉపాధ్యాయులకు వోటు హక్కు కల్పించారు. వీరు ఎవరినైనా ఎన్నుకోవచ్చు అని పేర్కొన్నారు. గవర్నర్‌ ‌విషయానికి వొస్తే కళలు, సాహిత్యం, వైజ్ఞానిక, సహకార,  సామాజిక సేవలో ప్రత్యేక అనుభవం గడించిన వారిని శాసన మండలికి ఎంపిక చేయాలని పేర్కొన్నారు. గవర్నర్‌ ‌వ్యవస్థ ఎలాంటి కళా పోషకులను, సంఘ సేవకులను ఎన్నుకుంటుందో చరిత్రనే స్పష్టం చేస్తుంది.

శాసన మండలిని పెద్దల సభగా పిలుచుకు ంటారు. శాసన మండలిలో ఏ వృత్తికి కలుగని అవకాశం ఉపాధ్యాయ వృత్తికి దక్కింది. మండలికి ఎన్నుకోవడానికి వృత్తిపరంగా వోటింగ్‌ అవకాశాలు  ఇవ్వదలుచుకుంటే వైద్య వృత్తి, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వృత్తి పని వారు, నైపుణ్యం కలిగిన వివిధ సామాజిక వర్గాలో ఆరితేరినవారు కూడా ఉన్నారు. ఆ విధంగా కాకుండా పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు మాత్రమే ప్రత్యేకమైన వోటు హక్కు అవకాశాలను కల్పించారు. దేశంలో, మరి ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. అందుకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన అన్ని ఉద్యమాలకు ఉపాధ్యాయులే చోధక శక్తులు. నాయకులు ఆదిభట్ల కైలాసం, వెంపటి సత్యం, కొండపల్లి సీతారామయ్య నుంచి మొదలుకొని శివ సాగర్‌, ఆచార్య జయశంకర్‌, ఆచార్య సాయిబాబా, ఆచార్య కోదండరాం వరకు ఇక్కడ ఉద్యమాలకు వారే నాయకత్వం వహించారు.

తెలంగాణ సమాజాన్ని ఇన్ని దశాబ్దాలుగా నడిపింది ఉపాధ్యాయులే. అనేక సామాజిక ఉద్యమాలకు ఉపాధ్యా యులు నాయకత్వం వహించారు. ఇవాళ అలాంటి వర్గం నుంచి వాళ్లు వక్రమార్గంలో పయనించడం బాధ్యతారా హిత్యాన్ని  కనబరుస్తుంది. ఉపాధ్యాయులు ప్రజా కవి కాళోజీ నారాయణరావు శక్తివంచన లేకుండా పనిచేసే వ్యక్తి గా ఎన్నుకున్నారు కదా.!  ఎలాంటి స్థితి నుంచి ఈరోజు ఎలాంటి తిరిగి దిగజారారు.? ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థాయి జ్ఞానం ఉన్న వ్యక్తుల నుంచి ఎన్నికయ్యే  ప్రతినిధులు కదా.. ! ఏ వృత్తిలో ఉన్న వారికి కూడా ఇలాంటి అవకాశం ఇవ్వలే కదా.! రాజ్యాంగ నిపుణులు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను గుర్తించి వోటు హక్కు కల్పించారు కదా.! రాజకీయ వృత్తి అంటే ఎప్పటికప్పుడు మారుతునే ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారి ద్వారా  ఎమ్మెల్సీ ఎన్నిక కావడం అనేది రాజ్యాంగ కర్తలు ఆలోచించిన ,ఊహించిన విధానం. అత్యున్నత స్థాయి వ్యక్తులు శాసనమండలికి వస్తారని ప్రజాస్వామ్యం పట్ల, విలువలు,గౌరవం పెంచుతారని అదే స్థాయిలో చర్చలు కొనసాగుతాయని మండలికి, అసెంబ్లీకి ఎన్నిక కాబడే వారి మధ్య వ్యత్యాసం చూపిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించే విధానం చూపిస్తారని, చైతన్యవంతమైన (ఉపాధ్యాయుల) వోటర్ల చేత, చైతన్యమైన వ్యక్తులు మండలికి పంపబడతారని రాజ్యాంగ నిపుణులు భావించారు. కానీ క్రమక్రమంగా గౌరవప్రదమైన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వొస్తున్నారు.

ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికలు జరిగే తేదీ వరకు ఎన్నికల సంఘం పార్టీ లు, సంబంధిత అభ్యర్థులు, వో టర్లు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటో కూడా స్పష్టంగా తెలియప రుస్తారు. ఎన్నికలలో జరిగే అక్రమాలను పరిశీలించడానికి విచారణ అధికారులను కూడా నియమిస్తారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామంటారు. కానీ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఎన్నికల  సంఘం మాత్రం చూసీచూడనట్లు గానే వ్యవహరిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీకి, పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారుతూ వొస్తుంది.కొన్ని ప్రజాస్వామిక సంస్థలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వొస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం చోద్యం చూస్తూనే ఉంది.

ఆ నోట్ల కట్టల ప్రవాహం వివేకవంతమైన, విద్యావంతులైన ఉపాధ్యాయుల దగ్గరకు కూడా చేరింది. తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచారానికి ఫిబ్రవరి 25న తెరబడింది. అదే రోజు సాయంత్రం వెను వెంటనే కొంతమంది అభ్యర్థులు తాయిలాల తెగుళ్ళకు తెరలేపారు. పోటీ చేసే అభ్యర్థులు, వోటు వేసే ఉపాధ్యాయులు బహుశా కొంత తెలివిగలవారు కావడం వల్లనేమో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఫోన్‌ ‌పే ద్వారా గూగుల్‌ ‌పే ద్వారా వోటుకు నోట్లు పంపుతున్నారు, పొందుతున్నారు. వివిధ జిల్లాలో అనేక మంది ఉపాధ్యాయులకు రూ.2000, రూ.3000, రూ.5000 ఫోన్‌ ‌పే ద్వారా పంపించబడిన ఆధారాలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. కోట్ల రూపాయలతో వోట్లు కొన్నవారు చట్టసభల సంప్రదాయాలను ఎలా గౌరవిస్తారు.? దీని పైన వేగవంతం గా ఎన్నికల సంఘం స్పందించాలి. ఆ అభ్యర్థులెవరో వారిని పోటి నుంచి పక్కకు తప్పించాలి.

ప్రజాస్వామ్యం భయంకరంగా అపహాస్యం పాలవుతుంది. ప్రలోభాలకు గురి చేసేటువంటి స్థితిలోకి ఉపాధ్యాయులు దిగజారడం ఉపాధ్యాయ వృత్తికే సిగ్గుచేటు. ఇవాళ ఇంత దిగజారుడు స్థితిలోకి వెళ్లి ఉపాధ్యాయ వృత్తిని దిగజార్చుతున్నారు.ఉపాధ్యాయ వోటర్లు అత్యంత చైతన్యవంతులు అలాంటి వ్యక్తులు డబ్బులకు దిగజారిన తర్వాత ఇలాంటి డబ్బుల మూటల ప్రజాస్వామ్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పాత్రను ఏ మేరకు పోషించగలుగుతుంది.? బడుగు బలహీన వర్గాలకు పాలన వ్యవస్థలో  చోటు ఏలా ఇవ్వగలుగుతారు.? ఈ దేశం భవిష్యత్‌ ‌లో ఇంకా ఎట్లా ఉంటుంది.? ఇలాంటి వాళ్లు ఏ ప్రజల గురించి ఆలోచిస్తారు.? ప్రజలు ఇదంతా  గమనిస్తే ఏదో ఒక రోజు వ్యవస్థలన్ని కుప్పకూలడం ఖాయం.

ధన దాహంతో వోట్లను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్న అభ్యర్థులను భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పౌర సమాజం మరింత చైతన్యవంతం కావాలి. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలు పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ పతనానికి ప్రధాన కారణం.1975 లో ఇందిరా గాంధీ ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆనాటి అలహాబాద్‌ ‌హైకోర్టు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. కానీ నేటి ఎన్నికల సంఘం,నిర్వహణ వ్యవస్థలు ఎన్నికల సరళని పట్టించుకోకపోవడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలన్ని  పతనమవుతున్నాయి.ఎన్నికల సంఘం తీరు మారాల్సిన అవసరం ఉన్నది.స్వతంత్రంగా వ్యవహరించాలి. అంతిమంగా ఎన్నికల్లో పారదర్శకత, జవాబుదారీతనాని ప్రదర్శించాలి.

ఉపాధ్యాయ మిత్రులారా.! కాళోజీ  మాటల్లో
‘‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు,
ఏ పాటి వాడో చూడు,
ఎన్నుకుంటే వెలగ పెట్టడం కాదు,
ఇందాక ఏం చేశాడో చూడు,
ఇప్పుడు కట్టే ముడుపులు కాదు,
ఇందాక చెల్లించింది చూడు,
వాడు పెట్టుకునే టోఫీ కాదు
పెట్టిన టోపీని చూడు
ఎగరేసిన జెండా కాదు
చాటున ఆడరచిన దందా చూడు..
మనిషిని చూడు, చరిత్రను చూడు..
నుడువులు కాదు, నడవడి చూడు..

అని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, విలువల కోసం ఎన్నికల్లో మంచి గుణగణాలు ఉన్న అభ్యర్థి ని ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఎవరో ఒకరు, ఏదో ఒకరకంగా గెలిచి చట్ట సభలకు పోవడం ప్రజాస్వామ్యం కాదు. చట్టసభల ప్రాధాన్యత మీ చేతుల్లోనే ఉంది. చట్టసభలు, ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలు ఉపాధ్యాయులైన మీ చేతుల్లోనే ఉన్నాయి.మీ ఓటు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింభించాలి. ప్రజాస్వామ్య విలువలను పెంచాలి. వీటిని కుప్పకూల్చకండి. ఎన్నికలను  సార్థకం చేయడానికి డబ్బు సంచులను తిప్పికొడుతూ ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన నైతిక బాధ్యత మీ పై ఉన్నది. ‘అక్షర రూపం దాల్సిన ఒక సిరా చుక్కా లక్ష మెదళ్లకు కదలిక’ అన్నసారాన్ని యాది పెట్టుకొని చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత చేకూరుస్తారని బుద్ది జీవులు ఆశిస్తున్నారు.

image.png
పి. సైదులుగౌడ్‌
‌న్యాయవాది, తెలంగాణ విద్యావంతుల వేదిక 9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *