– ఎంపీలను కలిసి విన్నవించిన జేఏసీ నేతలు
– ఆర్టీసీ విలీనంపై స్పష్టత కోరుతూ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్ష
– తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే జూన్ 2న విలీనం అపాయింటెడ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రధాన సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డిని, ఎంపీ రఘురామ్‌రెడ్డిని జేఏసీ నాయకులు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు జరిగిన తరువాతనే విలీనం పక్రియను ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి ఇటీవల వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ కత్తుల యాదయ్య, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, యాదగిరి, బాబు, బుద్ద విశాల్, రవికిరణ్ పాల్గొన్నారు. ఇదిలావుంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యÖనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1న ఇందిరా పార్క్ వద్ద సామూహిక దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యÖనియన్ ఎన్నికలకు ముందుగా ఉద్యోగుల పక్రియ పూర్తిచేయాలని, 2026 మే 1 నుంచి అపాయింటెడ్ డే ప్రకటించాలని టీజేఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డే కంటే ముందుగా యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి ప్రకటించడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొందని అభిప్రాయపడ్డారు. జూన్ 1న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్రకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. ప్రభుత్వంలో విలీనం కోరుకునే ఉద్యోగులంతా యూనియన్లకు అతీతంగా ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య కూడా మద్దతు ప్రకటించింది. యాజమాన్యం వద్ద పరిష్కారం కావాల్సిన 29 సమస్యలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఎన్నికలకు వెళ్లడం వల్ల కార్మికులు నష్టపోతారని కార్మిక సమాఖ్య నాయకుడు కె.రాజిరెడ్డి తెలిపారు. విలీనం అనంతరం యూనియన్లు కొనసాగితే ఎన్నికల అంశాన్ని పరిశీలించాలన్నారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే కమిటీలో ప్రతి యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అపాయింటెడ్ డే ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





