– ఎరువుల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో దోహదం
– ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణం : మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. రాజేంద్రనగర్‌లోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు ప్రయోగశాల(ఎఫ్సీవో)కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించింది. ఈ ప్రయోగశాల ఐఎస్వో/ఐఈసీ 17025:2017 ప్రమాణాలను విజయవంతంగా అమలు చేసి ఎరువుల రసాయన విశ్లేషణలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించింది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తొమ్మిది నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలు (ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు)లో రాజేంద్రనగర్ ఎఫ్సీఓ ప్రయోగశాలే తొలిసారిగా ఈ గుర్తింపు పొందినదిగా నిలిచింది. ఈ ప్రయోగశాలలో ప్రస్తుతం మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పౌడర్, గ్రాన్యులర్) ఎరువుల నాణ్యత పరీక్షలకు గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు గర్వకారణం. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే ఎరువుల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, రాష్ట్రంలో నాణ్యత నియంత్రణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో ఈ గుర్తింపు కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రయోగశాలకు లభించిన గుర్తింపు రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలకు కూడా దశలవారీగా కల్పించే ప్రక్రియకు నాంది పలికింది. ఈ సందర్భంగా గుర్తింపు పత్రం గురించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకువివరించారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గుర్తింపు పత్రాన్ని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాజేంద్రనగర్ ఎఫ్సీఓ ప్రయోగశాలకు గుర్తింపు లభించడం రాష్ట్ర వ్యవసాయ శాఖకు గర్వకారణమని అన్నారు.
మంత్రులతో ఇరాన్ ప్రతినిధి బృందం భేటీ 
ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సచివాలయంలో సమావేశమయ్యారు. ఇరాన్ సహకార, కార్మిక, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి హెచఈ డాక్టర్ మెయిదరి, డాక్టర్ సార్ఫి, సహకార శాఖ ఉప మంత్రి, భారత్‌లోని ఇరాన్ రాయబారి హెచ్ఈ డాక్టర్ మహమ్మద్ ఫాత్ అలీ, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ హెచ్ఈ హమీద్ అహ్మదియే, వైస్ కాన్సుల్ మొహ్సిన్ మొఘద్దమి, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హషెమి మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని మంత్రి తుమ్మల ఆó బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో సహకార రంగంలో పరస్పర అనుభవాల మార్పిడి, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. అనంతరం మంత్రులు తుమ్మల, వివేక్‌లు ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ప్రతినిధి బృందం కూడా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





