– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
– ఆనాటి హామీని నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రోహిత్ వేముల తెలంగాణ(ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు-2026 రూపకల్పనపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తొలి కీలక సమావేశం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యాసంస్థల్లో వివక్ష లేని ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం చట్టాన్ని అత్యంత పటిష్ఠంగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయÖ)లో జరిగిన రోహిత్ వేముల విషాద ఉదంతం తెలంగాణనే కాక దేశం మొత్తాన్ని కదిలించిందన్నారు. ఆనాడు వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన పోరాటంలో ప్రస్తుత లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా యూనివర్సిటీకి వచ్చి సంఘీభావం ప్రకటించారని గుర్తు చేశారు. నాడు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా తాను (భట్టి విక్రమార్క), మంత్రి శ్రీధర్‌బాబు, క్రియాశీలక నేత పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున పోరాడామన్నారు. భవిష్యత్తులో ప్రజా ప్రభుత్వం వచ్చాక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి వివక్ష లేని విద్యా విధానాన్ని, చట్టాన్ని తీసుకొస్తామని ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చడానికి రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తున్నదని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలని, వివక్ష కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉండకూడదన్న రాహుల్ గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని భట్టి చెప్పారు.
బిల్లు రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయాలి
బిల్లు రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.ఇందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కొత్త చట్టానికి సంబంధించిన సమగ్ర విధివిధానాలతో కూడిన ప్రాథమిక ముసాయిదా నివేదికను సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖ సెక్రటరీని ఆదేశించారు. కర్ణాటకలో ఇప్పటికే ఇలాంటి చట్టం కోసం జరుగుతున్న ముసాయిదా ప్రయత్నాలను పరిశీలించి అక్కడి ఉత్తమ పద్ధతులను స్వీకరించాలని సూచించారు. ఈ చట్టం రూపకల్పనలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తామని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని ప్రకటించారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి బిల్లులో తుది మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ సబ్-కమిటీ ఆమోదం పొందిన అనంతరం ఈ చరిత్రాత్మక బిల్లును త్వరలోనే శాసనసభ ముందుకు తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
న్యాయపరంగా పటిష్ఠంగా ఉండాలి
ఈ చట్టానికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు, సుప్రీంకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్‌ను ప్రత్యేక ఆహ్వానితురాలిగా పిలిపించి చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కొలంబియా లా స్కూల్(న్యూయార్క్) నుండి ఎల్.ఎల్.ఎమ్ పూర్తి చేసిన ఆమె అనుభవం చట్టాన్ని అత్యంత సమగ్రంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమావేశానికి కమిటి సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





