ప్రభుత్వోద్యోగులకు మహా భరోసా న్యూ హెల్త్ స్కీమ్

8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయుక్తం
సీజీహెచ్ఎస్ ప్యాకేజీల కింద 1,816 రకాల చికిత్సలు
పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా, నమ్మకం కలిగిస్తూ చక్కటి ఆరోగ్య భద్రతా వ్యవస్థను అందించాలనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం న్యూ ఎంప్లాస్ హెల్త్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చుల కోసం అప్పులపాలై వాటిని తీర్చలేక సతమతమవుతున్న దుస్థితిని మార్చి వారికి సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను సచివాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ డీడ్‌ను ఆవిష్కరించి న్యూ స్కీం వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. డౌన్‌లోడ్ చేసుకునే డిజిటల్ హెల్త్ కార్డులను విడుదల చేసి ఉద్యోగ సంఘాల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా మన కుటుంబ సభ్యులేనని, వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, దీనికి ఉప ముఖ్యమంత్రి హోదాలో తాను చైర్మన్‌గా, తన సహచర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా వ్యవహరించారని వివరించారు. తామంతా సుదీర్ఘంగా చర్చించి, పకడ్బందీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామని, దాని ప్రతిరూపమే ఈ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని చెప్పారు. సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఉద్యోగులు రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత ఇన్‌పేషెంట్ వైద్య సేవలు పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ప్యాకేజీ ధరలకనుగుణంగా 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలు ఈ పథకం కింద లభిస్తాయని తెలిపారు.
గత పాలకుల నిర్లక్ష్యం – తమ ప్రభుత్వ చిత్తశుద్ధి
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం సకల జనుల సమ్మె సహా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం శూన్యమని భట్ఠి విక్రమార్క విమర్శించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ.10 వేల కోట్ల బిల్లులను తమ ప్రభుత్వం మానవీయ కోణంలో నెలకు రూ.2000 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తున్నదని, ప్రతి 15 రోజులకోసారి తానే స్వయంగా సమీక్షిస్తూ రూపాయి కూడా పెండింగ్ లేకుండా చూస్తున్నానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, అర్హులైన 1.06 కోట్ల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంతటి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో ప్రతీ ఉద్యోగి రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేయాలని డిప్యూటీ సీఎం కోరారు.
  
ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ సర్కారే 
– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఏపీలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మరింత సమర్థవంతమైన, సుస్థిరమైన, పారదర్శకమైన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను రూపొందించామని మంత్రి తెలిపారు. గతంలో అమలులో ఉన్న హెల్త్ స్కీమ్‌లో ప్యాకేజీ రేట్లు తక్కువగా ఉండటంతో అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ భాగస్వామ్యం కావడం లేదని, క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం, ఉద్యోగుల ప్రాతినిధ్యం లేకపోవడం, ప్యాకేజీల సవరణలో పరిమితులు వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటికీ శాశ్వత పరిష్కారంగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ స్కీమ్ అమలులో ఉద్యోగులు, పెన్షనర్ల కంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేస్తుందని, ప్రతి పైసాను ఈహెచ్ఎస్ అమలు కోసమే వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కామినేని, కాంటినెంటల్, కేర్, స్టార్, బసవతారకం వంటి ప్రముఖ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు అత్యాధునిక వైద్య సేవలు పొందే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ పథకంలో భాగస్వామ్యమైన అన్ని హాస్పిటళ్ల యాజమాన్యాలు, డాక్టర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు. ట్రస్టులో ప్రభుత్వం తరఫున 17 మంది, ఉద్యోగుల తరఫున 10 మంది, పెన్షనర్ల తరఫున ముగ్గురు సభ్యులు ఉండటం వల్ల ఉద్యోగుల భాగస్వామ్యంతో పారదర్శకంగా పథకం అమలవుతుందని వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ డిజిటల్ హెల్త్ కార్డులను వెబ్ పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రీ-ఆథరైజేషన్ నుంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో వెల్‌నెస్ సెంటర్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ప్రతిరోజూ సుమారు 1,800 మందికి ఔట్‌పేషెంట్ సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రతీ కేంద్రంలో ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ డాక్టర్లు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ల్యాబ్ పరీక్షలు, బ్రాండెడ్ మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వెల్‌నెస్ సెంటర్లు లేని 24 జిల్లాల్లో 24 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ సేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సభ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెన్షనర్ల సంఘాల నాయకులు, నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం : డిప్యూటీ సీఎంకు ఉద్యోగుల కృతజ్ఞతలు 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కార్డుల అమలుకు శ్రీకారం చుట్టడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చొరవ తీసుకుని ఆరోగ్య కార్డుల అమలును వేగవంతం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఈహెచ్‌సీటీ ట్రస్ట్ మెంబర్ దేవరకొండ సైదులు, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.పోచయ్య, ఎస్‌టీయÖ రాష్ట్ర అధ్యక్షుడు, ఈహెచ్‌సీటీ ట్రస్ట్ మెంబర్ సదానందం గౌడ్, పెన్షనర్ల అసోసియేషన్ చైర్‌పర్సన్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *