– కమిటీ సభ్యులే జిల్లాలకు రావాలి
– మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల ఉద్యమకారుల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16:తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ గురువారం అమరవీరుల స్మారక చిహ్నంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సక్షా సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోతె శోభన్ రెడ్డి, ప్రొఫెసర్ ఎమ్.కోదండరామ్, అద్దంకి దయాకర్, ఎస్.రాములు నాయక్ తదితరులు హాజరై ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి తరలివచ్చిన పోరాటయోధుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనలో మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల ఉద్యమకారులు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. సింగరేణి బొగ్గు గనుల సమ్మెల ద్వారా నాటి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మంచిర్యాల, ఆసిఫాబాద్ కార్మిక శ్రేణులు, ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా నిలిచిన కరీంనగర్ పోరాట గడ్డల త్యాగాలు చరిత్రాత్మకమైనవని ప్యానల్ స్పష్టం చేసింది. ముఖాముఖి సంప్రదింపుల్లో పాల్గొన్న అత్యధిక శాతం మంది ఉద్యమకారులు సంక్షేమ పథకాల కంటే ముందే రెండు అత్యంత కీలకమైన డిమాండ్లను కమిటీ ముందు గట్టిగా లేవనెత్తారు. సుదూర ప్రాంతాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి సరిహద్దు జిల్లాల నుండి వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ఉద్యమకారులు హైదరాబాద్ దాకా రాలేకపోతున్నారని ప్రతినిధులు కమిటీ దృష్టికి తెచ్చారు. అందువల్ల, కమిటీ సభ్యులే స్వయంగా జిల్లాలకు వచ్చి క్షేత్రస్థాయిలో ఉండి నిజమైన ఉద్యమకారులను గుర్తించే పక్రియను చేపట్టాలని పట్టుబట్టారు. రెండు ప్రధాన డిమాండ్లతోపాటు క్షేత్రస్థాయి యోధులు తమ ఇతర ఆత్మగౌరవ సంక్షేమ వినతులను కూడా కమిటీకి సమర్పించారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి 250 గజాల నివాస స్థలం కేటాయించాలని, గౌరవప్రదమైన నెలవారీ పెన్షన్ అందించాలని, ఉద్యమకారుల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వీటితోపాటు మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక ప్రయోజనాలు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం హెల్త్ కార్డులు, ఉచిత నాణ్యమైన విద్య, ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాల్సిందిగా వినతి పత్రాలు సమర్పించారు. ఈ అంశాలపై కమిటీ సభ్యులు స్పందిస్తూ ప్రతిపాదనలు వందకు వంద శాతం న్యాయమైనవి. ఈ అంశాలను సమగ్ర నివేదికలో చేర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తక్షణమే తీసుకెళ్తామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు