– అది రైతు గోస కాదు.. బీజేపీ రాజకీయ ఘోష
– బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్’
– మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : అకాల వర్షాలనూ మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చురకలంటించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా ఎరువుల ధరలు పెంచి, నల్ల చట్టాలతో తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ.. ఇవాళ తెలంగాణలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట పొలిటికల్ యాత్రలు చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. అది ‘రైతు గోస’ కాదని.. అధికారం కోసం బీజేపీ నాయకులు పెడుతున్న ‘రాజకీయ ఘోష’ అని మండిపడ్డారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తున్నదెవరో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని అడగటానికి వెళ్తే మీ వాళ్లకు నూకలు తినటం అలవాటు చేయండంటూ అవమానించిన మీ కేంద్ర మంత్రుల చరిత్రను మర్చిపోయారా అని బీజేపీ నాయకులను మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. అప్పట్లో మన రైతుల పక్షాన నిలబడకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఇక్కడ పొలిటికల్ టూర్లు చేస్తూ కాలక్షేపం చేయక దిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రైతాంగానికి న్యాయంగా రావాల్సిన హక్కులను, నిధుల్ని సాధించుకు రావాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు రైతాంగానికి ధైర్యం చెప్పి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా అన్నదాతలకు అండగా నిలవాల్సిన బీఆర్‌ఎస్.. ఆ పని పక్కనబెట్టి కేవలం రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుపుతుంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా చివరి గింజ కొనే వరకు అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల దుష్ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





