– ఎగుమతి ఆధారిత మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
– రైస్ మిల్లింగ్ రంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం
– ఆధునిక గోదాములు, స్టీల్ సైలోల నిర్మాణానికి పెట్టుబడులు ఆహ్వానం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణను దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక సాంకేతికతలు, విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో కూడా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ రైస్ అండ్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్‌పో-2026లో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో రైస్ మిల్లర్లు కీలక భాగస్వాములని పేర్కొన్న మంత్రి, రైతులు, మిల్లర్లు, వినియోగదారులు అందరూ కలిసి అభివృద్ధి ఫలాలను పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బియ్యం ఎగుమతులను పెంచేందుకు తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే ఎగుమతి ఆధారిత రైస్ మిల్లులకు, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న మిల్లులు ఎగుమతుల వైపు మళ్లేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ప్రపంచ బియ్యం మార్కెట్లలో తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమన్నారు.
యాంత్రీకరణ ద్వారానే అభివృద్ధి
రైస్ మిల్లింగ్ రంగంలో కార్మికుల కొరత ప్రధాన సవాలుగా మారిందని పేర్కొన్న మంత్రి యాంత్రీకరణ, ఆటోమేషన్‌కు మిల్లర్లు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా ఉత్పాదకత పెరగడంతోపాటు కార్మికుల కొరత సమస్యను అధిగమించవచ్చన్నారు. స్టీల్ సైలోలు, ఆటోమేటెడ్ గోదాములు, కృత్రిమ మేధస్సు ఆధారిత ధాన్యస్త్ర పర్యవేక్షణ వ్యవస్థలు, డిజిటల్ ఇన్వెంటరీ నిర్వహణ వంటి ఆధునిక నిల్వ సదుపాయాల నిర్మాణం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజా-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో భారీ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానించారు.
పర్యావరణహిత పార్బాయిలింగ్ సాంకేతికతలు అవసరం
పార్బాయిలింగ్ యూనిట్లలో నీటి వినియోగాన్ని తగ్గించే, విద్యుత్ ఆదా చేసే ఆధునిక సాంకేతికతలను పరిశ్రమలు అవలంబించాలని మంత్రి సూచించారు. భవిష్యత్ ప్రాసెసింగ్ యూనిట్లు నీటి పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
పోషక విలువలతో కూడిన బియ్యం ఉత్పత్తి
నాణ్యతతోపాటు పోషక విలువలను కూడా దృష్టిలో ఉంచుకుని బియ్యం ప్రాసెసింగ్ జరగాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నియంత్రిత వైటనింగ్, ప్రిసిషన్ పాలిషింగ్, పోషకాలనుకాపాడే సాంకేతికతలు, ఏఐ ఆధారిత నాణ్యత నిర్ధారణ విధానాలు వినియోగదారులకు మరింత ఆరోగ్యకరమైన బియ్యం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
దేశానికి దిక్సూచి తెలంగాణ
ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. దేశంలో యాసంగి వరి కొనుగోళ్లలో తెలంగాణ వాటా దాదాపు 60 శాతం ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్, యాసంగి సీజన్లలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం దాదాపు రూ.39 వేల కోట్లు జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు రూ.96 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు తెలిపారు. అలాగే సన్న బియ్యం పంపిణీ పథకం ద్వారా 3.2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందని, ఇందుకోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రైతులు, మిల్లర్లు, సాంకేతిక నిపుణులు, విధాన రూపకర్తలు సమష్టిగా కృషి చేస్తే బియ్యం ఉత్పత్తిలోనే కాక బియ్యం సాంకేతికత, ఆవిష్కరణలు, ఎగుమతుల రంగంలో కూడా తెలంగాణ ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.
————————-
చేనేతల సంక్షేమం, అభివృద్ధికి సంపూర్ణ అండ : ఉత్తమ్
‘థ్రెడ్ పోచంపల్లి’ సందర్శన
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడం ప్రతి తెలంగాణవాసికి గర్వకారణమని మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ‘త్రెడ్ పోచంపల్లి’ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ ఒక వస్త్ర కళ మాత్రమే కాదని, అది తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సృజనాత్మకత, సంప్రదాయ జీవన విధానానికి అద్దం పట్టే అద్భుత కళారూపమని అభివర్ణించారు. రంగుల సమన్వయం, నూలు పోగుల్లో కనిపించే అపూర్వమైన డిజైన్లు, తరతరాలుగా వస్తున్న కళాత్మక నైపుణ్యం వల్ల పోచంపల్లి ఇక్కత్ ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పారు. చేనేత కార్మికుల కష్టం, పట్టుదల, నైపుణ్యం వల్లే పోచంపల్లి పేరు ప్రపంచ పటంలో నిలిచిందని మంత్రి కొనియాడారు. ఒక చీర తయారీ వెనుక కుటుంబమంతా కలిసి చేసే శ్రమ, సృజనాత్మకత, అంకితభావం దాగి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంక్షేమ కార్యక్రమాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక సహాయం, శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదల ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పోచంపల్లి పేరు నేడు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో వినిపించడానికి కారణం చేనేత కార్మికుల ప్రతిభేనని కొనియాడారు. ఈ కళను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. యువత కూడా చేనేత రంగం వైపు ఆకర్షితులయ్యేలా ఆధునిక డిజైన్లు, కొత్త మార్కెటింగ్ విధానాలు, డిజిటల్ వేదికల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసి, ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





