- భూదందాలో సీఎం కుటుంబీకులు, కాంగ్రెస్ ప్రముఖులు
– కల్వకుంట్ల కవిత ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు ధారాదత్తం చేస్తున్నదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో చురుకుగా ఉన్నారని ఆరోపించారు. అయితే ఈ ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి తాము కాపాడుతామని స్పష్టం చేశారు. హైడ్రా..పేదల కాలనీల్లో దాడులు చేసి ఆ భూములను పెద్దలకు అప్పగిస్తోందని మండిపడ్డారు. శ్రీఆదిత్య కంపెనీ రివర్ బెడ్‌పైన ప్రాజెక్టు కడుతోందని.. ఆ కంపెనీ వెనుక ఓ ఎంపీ ఉన్నారన్నారు. శ్రీ ఆదిత్య కంపెనీకి బీఆర్‌ఎస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారని.. దాన్ని ముట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదని కవిత విమర్శించారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఏపీ సీఎం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో మాట్లాడి 200 టీఎంసీల నీళ్లు తెచ్చి ఆ తర్వాత బనకచర్ల గురించి మాట్లాడాలన్నారు. అప్పుడు కేటీఆర్ పాలన నడిచిందని.. ఇప్పుడు కూడా కేటీఆర్ పాలనే నడుస్తోందన్నారు. అప్పుడు కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు.. ఇప్పుడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పర సవాళ్లతో ఒరిగేదేమీ లేదని కవిత విమర్శించారు. తెలంగాణ బరాబర్ ప్రజల జాగీరే అని, పవన్ కల్యాణ్ జాగీర్ కాదని కవిత స్పష్టం చేశారు. ఆంధ్రా విషకోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నామన్నారు. ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్‌కు మద్దతు ఇస్తే నాలుగు ఓట్లు వస్తాయని బీజేపీ భావిస్తోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న 8 సీట్లు పోతాయన్నారు. పవన్ కల్యాణ్ 10 ఎకరాలు శిఖం భూమిని కొనుగోలు చేశారని, కోడికుంట సర్వే నం. 706లో శిఖం భూమి ఉందన్నారు. రిజిస్టేష్రన్ సమయంలో అనేక తప్పులు జరిగాయని, ఆ భూమిని పవన్ తిరిగి ఇచ్చేయాలన్నారు. శిఖం భూమిలో వేసిన కంచెను పవన్ తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



