లక్ష్యాలకు తగ్గట్లు ఆదాయం రాబట్టాలి

– ఆర్థిక ప్రగతికి అదనపు నిధుల సమీకరణే కీలకం
– ప్రభుత్వ భూముల గుర్తింపు, ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి
– అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి
– రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేలా, బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలకు తగ్గట్లుగా ఆదాయం రాబట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం(రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ) ఉన్నతస్థాయి సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి కమిటీ సభ్యుడు ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాలని స్పష్టం చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలన్నారు. ముందుగా నిర్దేశించుకున్న క్యాలెండర్(టైమ్ లైన్) ప్రకారమే అన్ని శాఖల అధికారులు ఆదాయ పెంపు కోసం శ్రమించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్-పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏ అండ్ యÖడీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచఎండీఏ), పరిశ్రమలు, ఎక్సైజ్, మైనింగ్, రెవెన్యూ, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ తదితర కీలక శాఖలలో ప్రస్తుత వనరుల పురోగతిపై ఆరా తీశారు. రాబోయే రోజుల్లో ఆయా శాఖలు సాధించాల్సిన ఆదాయ లక్ష్యాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్రంలో భూముల మానిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూసంపదను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అధికారులు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. ఉప్పల్ భగాయత్ తరహాలోనే పారదర్శక విధానాలను అవలంబిస్తూ మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉన్న అవకాశాలను తక్షణమే గుర్తించాలని  అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ భూసంపదను గుర్తించి ల్యాండ్ పూలింగ్ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *