డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  • 540 ఎఫ్‌ఐఆర్‌ల రద్దుకు నిరాకరణ.. తెలంగాణ హైకోర్టు తీర్పు సమర్థన

  • సీఎంఆర్ బియ్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిల వ్యవహారంలో డిఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు (Rice Millers ) సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన 540 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ కొందరు మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను (ఎస్‌ఎల్‌పీలు) సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడంతో, ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసుల్లో మిల్లర్లకు ఉపశమనం దక్కకుండా పోయింది.

అసలేం జరిగింది?

దేశంలో ధాన్యం సేకరణలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో, పౌరసరఫరాల సంస్థ (TGSCSCL) ద్వారా సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,200కు పైగా రైస్ మిల్లులకు కేటాయిస్తారు. అయితే, కొంతమంది మిల్లర్లు ఆ ధాన్యాన్ని లేదా బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఎగవేశారు. ఆకస్మిక తనిఖీల్లో లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం దుర్వినియోగమైనట్లు తేలడంతో 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్టర్ మిల్లర్లపై 540 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ మిల్లర్లు వేసిన పిటిషన్లను 2026 మేలో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా చుక్కెదురైంది.

రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు: ప్రభుత్వం హెచ్చరిక

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిఫాల్టర్ మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం పౌరసరఫరాల సంస్థకు అందించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని తక్షణమే అప్పగించాలని లేదా బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. రైస్ మిల్లుల పరిశ్రమకు అండగా నిలిచేందుకు, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది. అయితే, ప్రభుత్వ ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు, అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్టం కింద బకాయిలు వసూలు చేస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *