మోదీ ప్రభుత్వంలోనే మహిళా సాధికారత

– కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి పార్టీలు మహిళా వ్యతిరేకులు
– తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలపై పెరిగిన నేరాలు
– మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతకు బాటలు వేస్తూ అనేక చారిత్రక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు మహిళలకు నిరంతరం అన్యాయం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. మోదీ పాలనలో పీఎం ఉజ్వల యోజన ద్వారా 11 కోట్లకు పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, జన్ ధన్ యోజన ద్వారా దాదాపు 32 కోట్ల మంది మహిళలకు బ్యాంకింగ్ సేవలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 3 కోట్ల మంది మహిళా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందాయని వివరించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి అధ్యక్షతన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం జరగగా రామచందర్ రావు ముఖ్య అతిథిగా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ రూప్ కుమారి చౌదరి విశిష్ట అతిథిగా ప్రసంగించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు పది కోట్ల మంది మహిళలకు ఉపాధి లభిస్తోందని, పీఎం ముద్ర యోజన, లఖ్‌పతి దీదీ, పీఎం మాతృవందన యోజన, ఈ-శ్రమ్ పోర్టల్, ఉమెన్ ఇన్ స్టార్టప్స్, శక్తి సదన్, స్వచ్ఛ భారత్ మిషన్, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు వంటి పథకాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని రామచందర్‌రావు వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (నారీశక్తి వందన్ అధినియం) ఆమోదింపజేస్తే కాంగ్రెస్, బీఆరఎస్, ఇండి కూటమి పార్టీలు దానికి అడ్డంకులు సృష్టించాయని తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ హైదరాబాద్‌లో వేలాదిమంది మహిళలతో ‘మహిళా ఆక్రోశ్ యాత్ర’తోపాటు ఇందిరాపార్కు వేదికగా ధర్నా చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళా రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో మహిళలపై నేరాలకు సంబంధించి సుమారు 20 వేల కేసులు నమోదు కాగా 2025 నాటికి ఆ సంఖ్య 21 వేలకు చేరుకుందని, మహిళలపై నేరాల శాతం 3.16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలతో వివరించారు. గత బీఆరఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైఫల్యాలపై మహిళా మోర్చా శ్రేణులు రాజీ లేని పోరాటం చేయాలని, అదే సమయంలో కేంద్ర పథకాలను ప్రతి గడపకూ చేర్చాలని పిలుపునిచ్చారు. రూప్ కుమారి చౌదరి మాట్లాడుతూ దేశంలో పేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించుకోవడం గతంలో తీరని కలగా ఉండేదని, ప్రధాని మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నేడు లక్షలాది మంది నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు. గతంలో ఎంపీ కోటా కింద ఒక లోక్‌సభ స్థానానికి ఏడాదికి కేవలం 25 గ్యాస్ కనెక్షన్లు మాత్రమే సిఫారసు చేసే పరిస్థితి ఉండేదని, నేడు ఏ సిఫారసు లేకుండానే ప్రతి నిరుపేద మహిళకు ఉజ్వల గ్యాస్ సిలిండర్‌ను అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2014కు ముందు బ్యాంకుల వైపు చూడలేని గ్రామీణ మహిళల కోసం జన్‌ధన్ ఖాతాలు తెరిపించి ఆర్థిక విప్లవానికి మోదీ తెరతీశారని ఆమె చెప్పారు. పారదర్శకమైన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానాన్ని తీసుకొచ్చి నిధులు అక్కాచెల్లెళ్ల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసి దళారీ వ్యవస్థను అంతమొందించారని ప్రశంసించారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నప్పటికీ బీజేపీ ఎల్లప్పుడూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోందని తెలిపారు. జేఎన్‌యూ ఘటనలో 11 మంది ఆడబిడ్డలు న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే ‘నేను అమ్మాయిని.. పోరాడగలను’ అని ప్రగల్భాలు పలికిన ప్రియాంక గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని, వారి ద్వంద్వ నీతి బట్టబయలైందని మండిపడ్డారు. అలాంటి బాధితులకు మహిళా మోర్చా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కమలం వికసించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మహిళా మోర్చా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *