నీటి, ప‌శుగ్రాసం కొర‌త ఉండొద్దు

– ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలి
– ఏజెన్సీ ప్రాంతాల్లో 125 రోజుల ‘ఉపాధి’ పనులు తప్పనిసరి
– గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటినుంచే సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి కొరత, ఉపాధి సమస్యలు, పశు గ్రాసం కొరత వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఆదివాసీ గిరిజన కుటుంబానికి కనీసం 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని స్పష్టం చేశారు. వీబీ జీ రామ్ జీ ద్వారా కరువు నివారణ చర్యలపై బేగంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. గ్రామంలోని చిట్టచివరి వ్యక్తి అభివృద్ధి చెందడమే నిజమైన సమగ్ర అభివృద్ధి అని మంత్రి స్పష్టం చేశారు. మారుమూల గిరిజన గ్రామాలు కూడా ఇతర గ్రామాలతో సమానంగా అభివృద్ధి చెందేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గతంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాల స్ఫూర్తితో ప్రస్తుతం కూడా ఐటీడీఏలు, పంచాయతీరాజ్ శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

వర్షపాతం లోటు నేపథ్యంలో ముందస్తు చర్యలు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 16 నుంచి 18 జిల్లాలు సాధారణ వర్షపాతం కంటే 20 శాతానికిపైగా లోటుతో ఉన్నాయని సదస్సు నివేదిక పేర్కొంది. 18 జిల్లాల పరిధిలోని 320 మండలాలల్లో తీవ్ర ఎల్నినో ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిందని వివరించింది. ఈ సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వర్షపాతం లోటు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వేసవి ప్రభావం ఈసారి దాదాపు ఎనిమిది నెలలపాటు ఎదుర్కోవాల్సి రావచ్చని అన్నారు.

ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి కల్పించాలి

ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధానంగా ఒకే పంటకు పరిమితమవుతుందని, రెండో పంట సాగు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మంత్రి వివరించారు. దీంతో ఆదివాసి గిరిజన కుటుంబాలకు ఆదాయ భద్రత కల్పించడంలో ఉపాధి హామీ పథకం కీలకమన్నారు. ప్రతి ఆదివాసీ గిరిజన కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని, ప్రతి కుటుంబానికి జాబ్‌కార్డు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఐదు నెలల్లో ప్రతి జాబ్ కార్డుకు నెలకు కనీసం రూ.7,500 వేతనం లభించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఆదివాసి గిరిజన నివాస ప్రాంతంలో కనీసం ఒక మేట్‌ను నియమించాలని, వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి పనుల అమలులో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

ఉపాధి పనులతో గ్రామాలకు శాశ్వత ఆస్తులు

ఉపాధి హామీ పథకం కింద కేవలం కూలీలకు పని కల్పించడమే కాక గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే శాశ్వత ఆస్తులను సృష్టించాలని మంత్రి సీతక్క సూచించారు. ఉపాధి హామీ కింద అందుబాటులో ఉన్న 370 రకాల పనులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలన్నారు. మట్టి, మొరం రహదారులు, గ్రామాలకు వెళ్లే బాటలు, అన్ని కాలాల్లో వినియోగించుకునే రహదారులు, ఊట చెరువులు, పెర్కొలేషన్ ట్యాంకులు, చెరువుల్లో పూడికతీత, కాలువలు, ఫీడర్ ఛానళ్లు, కందకాల తవ్వకం వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

పశువులకు నీరు, గ్రాసం అందేలా చర్యలు

ఏజెన్సీ ప్రాంతాల్లో పశు సంపద ఎక్కువగా ఉంటుందన్న మంత్రి పశువులకు అవసరమైన నీరు, గ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, నీటి సంరక్షణ పనులు చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులను స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తే గ్రామాల అభివృద్ధితో పాటు కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు.అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని, వాటికి తగిన పరిష్కారాలు కనుగొనగలమని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.

సమన్వయంతో ఎల్‌నినోను ఎదుర్కోవాలి

పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏలు, పేదరిక నిర్మూలన సంస్థలు సమన్వయంతో పనిచేసి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలని మంత్రి పిలుపునిచ్చారు. సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి కల్పనతోపాటు నీటి సంరక్షణ, పశుగ్రాసం అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్‌తోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్లు, ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అదనపు డీఆర్‌డీవోలు, పీవోలు, ఎంపీడీవోలు సదస్సులో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *