తెలంగాణ రాష్ట్ర రవాణా రంగం నేడు ఒక విషాద ఛాయలో మునిగిపోయింది. అహోరాత్రులు ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల జీవితాలు నేడు సందిగ్ధంలో పడ్డాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి, నెరవేరని హామీలకు బలైపోయిన ఒక నిరుపేద కార్మికుడి ఆర్తనాదం. ఏప్రిల్ 22 నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె, కార్మికుల ఆవేదనను ప్రతిబింబిస్తుంటే, శంకర్ గౌడ్ వంటి వారి ప్రాణత్యాగాలు సమాజాన్ని, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆలోచింపజేయాలి. మిర్యాలగూడలో మరో డ్రైవర్ ఇలాంటి చర్యకు పాల్పడకుండా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు. నల్గొండ, ఖమ్మం ప్రాంతాల నుండి కూడా ఇలాంటి ఘటనలే వెలుగులోకి రావడం అక్కడి సిబ్బంది అనుభవిస్తున్న తీవ్ర మానసిక మరియు ఆర్థిక వేదనను ప్రతిబింబిస్తోంది.
తెలంగాణ సాధన కేవలం రాజకీయ ప్రక్రియతోనే సాధ్యం కాలేదు, అందులో ఆర్టీసీ కార్మికుల చెమట, కష్టం మరియు త్యాగం దాగి ఉన్నాయి. నేడు మనం చూస్తున్న స్వరాష్ట్ర స్వప్నం సాకారం కావడంలో వారు చేసిన అలుపెరగని పోరాటం చిరస్మరణీయం. ఒక రకంగా చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులే “చైతన్య రథసారధులు”. 2011 సెప్టెంబరులో ప్రారంభమైన “సకల జనుల సమ్మె” లో ఆర్టీసీ కార్మికులు వెన్నెముకగా నిలిచారు. దాదాపు 27 రోజుల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఉద్యమ తీవ్రత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆలోచనలో పడేయడంలో ఈ సమ్మె సఫలీకృతమైంది.
ప్రస్తుతం పోరాట పంథాలో ఉన్న కార్మికులందరికీ ఒక విన్నపం. ఆత్మహత్యలు , ఆత్మబలిదానాలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. మనిషి ప్రాణం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఒక కార్మికుడు చనిపోతే, ఆ ఉద్యమం మరో మలుపు తిరుగుతుందేమో కానీ, ఆ కుటుంబానికి కలిగే తీరని లోటును ఏ ప్రభుత్వం, ఏ యూనియన్ భర్తీ చేయలేదు. మీరు చేసే పోరాటం మీ కుటుంబం కోసమే అయినప్పుడు, ఆ కుటుంబానికి మీరే లేకపోతే ఆ పోరాటానికి అర్థమే ఉండదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. చర్చల ద్వారా, పోరాటాల ద్వారా సాధించుకోలేనిది ఏదీ లేదు. కానీ, ప్రాణాలను పణంగా పెట్టడం వల్ల పాలకుల మనసు కరుగుతుందనుకోవడం భ్రమే అవుతుంది. తోటి కార్మికులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ఒత్తిడిలో ఉన్న సహచరులను గమనించి, వారికి అండగా నిలవాలి.
ఎన్నికల సమయంలో వేదికలపై మైకులు పగిలేలా ఇచ్చే హామీలు, అధికారం చేజిక్కించుకున్నాక విస్మరణకు గురికావడం భారతీయ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. కానీ, రవాణా రంగం వంటి అత్యవసర సేవల్లో పనిచేసే కార్మికుల విషయంలో ఈ నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీ కార్మికుల్లో ఎంతో ఆశను నింపింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హక్కులు, భద్రత లభిస్తాయని వారు ఆశించారు. సమ్మె మొదలై మూడు రోజులవుతున్నా, ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడం..( ఇది రాసే సమయానికి ) శోచనీయం.
కేవలం విలీనం మాత్రమే కాదు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పాత బకాయిలు, సంస్థ ప్రైవేటైజేషన్,పని ఒత్తిడి తగ్గించడం వంటి మౌలిక అంశాలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో దీపంలా మారిన తమ భవిష్యత్తును చూసి వారు భయపడుతున్నారు. కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్న మరో కీలక అంశం ప్రైవేట్ ఆపరేటింగ్ మోడల్ కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం..!ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాదని, ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణలో ఒక మార్పు అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ప్రస్తుత మోడల్ ఆర్టీసీ కార్యాచరణ నియంత్రణను తగ్గించి, ప్రైవేట్ సంస్థలపై ఆధారపడేలా చేస్తోందని, ఇది క్రమంగా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే మార్గమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం కార్మికులను శత్రువు లుగా చూడకూడదు. వారు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పో యి, మొండి వైఖరి అవలంబించడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల విద్యార్థులు, రోగులు, నిరుపేద ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. “ప్రజాస్వామ్యంలో పాలకుడు ప్రజల సేవకుడు. సేవకులు కన్నీరు పెడు తుంటే, పాలకులు మౌనం వహించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.” ప్రభుత్వం తక్షణమే షరతులు లేని చర్చలకు కార్మికులను ఆహ్వానించాలి. మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి భారీ నష్టపరిహారం ప్రకటించి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ కాలపరిమితిలోగా నెరవేరుస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలి.
కోల శంకర్ గౌడ్ మరణం ఆర్టీసీ చరిత్రలో ఒక చీకటి రోజు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకూడదు. కార్మికులు ఆవేశాన్ని విడనాడి ఆలోచనతో, ధైర్యంతో పోరాడాలి. ప్రభుత్వం అహంకారాన్ని విడనాడి మానవత్వంతో సమస్యను పరిష్కరించాలి. గుర్తుంచుకోండి, చక్రం తిరిగితేనే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. ఆ చక్రాన్ని తిప్పే చేతులు ఆగిపోకూడదు.. ఆ చేతులు ఆత్మహత్యలకు పాల్పడకూడదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ప్రతిష్టంభనకు తెరదించాలని, ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కార్మిక లోకానికి ధైర్యం కలగాలని ఆకాంక్షిద్దాం..!





