తెలంగాణా కోయిలపాట జహంగీర్

” పేద ముస్లిం కుటుంబంలో పుట్టి, అభ్యుదయ భావాలతో పెరిగి, విప్లవోద్యమ కార్యాచరణతో అనుబంధం పెంచుకుని, తెలంగాణ కళాకారుడుగా గొప్ప గుర్తింపు పొందిన కళాకారుడు జహంగీర్. తాను ఎంచుకున్న రాజకీయాల అమలుకై నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం, రాజీలేని తత్వం జహంగీర్ సొంతం. ప్రజా నాట్య మండలి, ప్రజా కళా మండలిలో పనిచేసాడు. గుట్కా, సారా, వ్యభిచార వ్యతిరేక ప్రచార సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మూఢాచార వ్యతిరేక, పీడిత మహిళల, బాలల హక్కుల ఉద్యమాల్లో భాగస్వామి అయ్యాడు. ఆట-పాట-మాట బంద్ కాలంలో.., తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన సందర్భంలో కూడా అదురు-బెదురు లేకుండా గళమెత్తిన పాటగాడు జహంగీర్..”

రమణాచారి

కోయిలాలో కోయిలమ్మ, కోయిలాలో కోయిలమ్మ, ప్రజాస్వామ్య తెలంగాణ తెద్దాము రావే, కోయిలాలో కోయిలమ్మ.ఈ పాట స్పురణకు రాగానే గుర్తొచ్చే గాయకుడు తుర్కపల్లి జహంగీర్. తుర్కపల్లి అతని ఇంటి పేరు కాదు. అతని ఊరు పేరు. పేద ముస్లిం కుటుంబంలో పుట్టి, అభ్యుదయ భావాలతో పెరిగి, విప్లవోద్యమ కార్యాచరణతో అనుబంధం పెంచుకుని, తెలంగాణ కళాకారుడుగా గొప్ప గుర్తింపు పొందిన కళాకారుడు జహంగీర్. తాను ఎంచుకున్న రాజకీయాల అమలుకై నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం, రాజీలేని తత్వం జహంగీర్ సొంతం. ప్రజా నాట్య మండలి, ప్రజా కళా మండలిలో పనిచేసాడు. గుట్కా, సారా, వ్యభిచార వ్యతిరేక ప్రచార సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మూఢాచార వ్యతిరేక, పీడిత మహిళల, బాలల హక్కుల ఉద్యమాల్లో భాగస్వామి అయ్యాడు. ఆట-పాట-మాట బంద్ కాలంలో.., తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన సందర్భంలో కూడా అదురు-బెదురు లేకుండా గళమెత్తిన పాటగాడు జహంగీర్. ప్రజలతో మమేకమై, ప్రజల తలలో నాలుకలా మెలుగుతూ, ప్రజల ఇతి బాధల గాధలను ఎలుగెత్తి చాటినవాడు జహంగీర్.

    ప్రత్యేక తెలంగాణ అంశం(1969) మరుగున పడ్డ తరుణంలో దగాపడ్డ తెలంగాణ-భువనగిరి, తెలంగాణ మహాసభ- సూర్యాపేట, ఈ వరుసలో ఏ.ఐ.పి.ఆర్.ఎఫ్. వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ ఆకాంక్షలను బలంగా ఎత్తి పట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-1969 తర్వాత వరంగల్ డిక్లరేషన్ వెలుగులో తెలంగాణ జనసభ ఆవిర్భావ సదస్సు 5,6 జులై 1998లో రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ హైద్రాబాద్ లో ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం కేవలం రాష్ట ఏర్పాటులో లేదు. సామ్రాజ్యవాదం, ప్రపంచ బ్యాంకు నిర్దేశిస్తున్న విధానాలలో లేదు. స్థానిక వనరులతో, స్వావలంబన విధానాలతో కింది నుండి జరిగే అభివృద్దే నిజమైన అభివృద్ధి. ఈ అభివృద్ది రాష్ట్రమంతటికి సమతూకంలో ఉండాలి.
ప్రజలు జీవించే హక్కుపైన విచక్షణ రహితంగా జరుగుతున్న దాడిని పూర్తిగా నిలిపివేయాలి. అదే ప్రజాస్వామిక తెలంగాణ. ఇలాంటి స్పష్టమైన విధానంతో ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ఏర్పడిన తెలంగాణ జనసభ సదస్సు జరిగినప్పుడు తొలిసారిగా జహంగీర్ ను వేదికపై దగ్గరగా చూసాను. బొల్లి మచ్చలోడు ఉయ్యాలో, దొంగ సూపులోడు ఉయ్యాలో అని పాట పాడుతుంటే గమనించాను. తలకు పాగా, భుజాన గొంగడి, కాళ్లకు గజ్జెలు కట్టి చిందు లేస్తుంటే చూడముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత జనసభకు అనుబంధంగా తెలంగాణ కళా సమితి ఏర్పాటు చేసినపుడు రాష్ట్ర కన్వీనర్ గా జహంగీర్, కో-కన్వీనర్ గా బెల్లి లలితను, వివిధ జిల్లాల నుండి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జనసభ నల్లగొండ జిల్లా కన్వీనర్ గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నేను తెలంగాణ కళా సమితి స్టేట్ ఇంచార్జిగా బాధ్యత తీసుకున్నాను.
     కళాకారులకు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక, రాజకీయ శిక్షణా కార్యక్రమం నాగార్జునసాగర్ లో పది రోజులపాటు నిర్వహించడం వల్ల మరింత అనుబంధం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పడంలో అదో మైలురాయి అని చెప్పడం అతిశయోక్తికాదు. జనసభ రాష్ట్ర కన్వీనర్ ఆకుల భూమయ్య, కో – కన్వీనర్ కనకాచారి తో సహా రాష్ట్రకమిటీ బాధ్యులందరూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడవలసిన ఆవశ్యకతను వివరించారు. పి.కె.ఎం. నాయకుడు అమరుడు ప్రభాకర్ డప్పు శిక్షణ ఇచ్చాడు. జహంగీర్, బెల్లి లలితకు తోడుగా ప్రధానంగా జిల్లాకే చెందిన రంగన్న, శీను, తొర్రూరు ఐలన్న పాటలు, నృత్య రూపకాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం సాగర్ వీధుల్లో కళా రూపాలతో, పాటలతో ర్యాలీ నిర్వహించి తాము పొందిన శిక్షణ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందారు. ఈ బాధ్యత అంతా జహంగీర్, లలితలే తీసుకున్నారు. తిరిగి జిల్లాలవారీగా శిక్షణా కార్యక్రమాలు, గ్రామాల కూడళ్ళలో ప్రదర్శనలు జరిగాయి.
అల్వాల్ లో జరిగిన జిల్లా శిభిరంలో పౌర హక్కుల సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరుడు ఆజం అలీ కళాకారులకు ఉండాల్సిన సామాజిక బాధ్యతపై సమగ్రంగా వివరించాడు. ముగింపుగా మూడు గ్రామాలలో గ్రామ సభలల జనాన్ని మూడువేలకు పైగా కూడగట్టి ప్రదర్శనలు ఇచ్చి మెప్పు పొందారు. గతంలో మంజీరా రచయితల సంఘం నిర్వహించిన సభల్లో పాల్గొన్న అనుభవంతోపాటు శిక్షణతో మరింత రాటుతేలారు. కల్వకుర్తి / నాగర్ కర్నూల్ లో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ సభపై మతోన్మాద ఏ.బి.వి.పి. గుండాలు దాడి చేయడం విద్యార్థి నాయకుడు కాశీమ్ తోపాటు దాడికి అడ్డుపడిన జనసభ రాష్ట్ర నేతలు కనకాచారి, మద్దిలేటి లను గాయపరిచారు. దాడికి నిరసనగా సభ నిర్వహించ తలపెడితే ప్రాంగణం మొత్తం పోలీస్ మయం చేశారు. స్టేజి ఎక్కకుండా దిగ్భంధనం చేశారు. నిర్బంధాన్ని గేలిచేస్తూ టి.ఎస్.ఎఫ్. కళాకారులు బెదరకుండా వీరోచితంగా ప్రదర్శన ఇచ్చారు. ఇలాగే మెదక్ లో, హుస్నాబాద్ తోపాటు పలుచోట్ల ప్రదర్శనలిచ్చి ప్రజలలో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు. తెలంగాణ ఆకాంక్షలను మరింత బలంగా తీసుకెళ్లడంలో కళాకారులు విజయం సాధించారు.
     ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం కావు. ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయాన్న జనసభ అవగాహనతో ఏకీభావం ఏర్పడింది. స్థానిక వనరులతో, స్వావలంబన విధానాలతో చేయవలసిన అభివృద్ది. వనరుల పరిరక్షణ ఇందులో కీలకాంశం. గ్రామాలకు తరలండి క్యాంపెన్ లో పాల్గొని వేలాది గ్రామాలలో ప్రజలను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యేలా కృషి చేశారు. మాట-ఆట-పాటలతో చంద్రబాబు ప్రభుత్వం నిర్బంధాన్ని లెక్క చేయకుండా జరిపిన యాత్రలో పాల్గొన్నారు. నిర్బంధం మరింత పెరిగి పాలకులు ప్రైవేట్ హింసను ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో రాజ్య హింసకు ప్రైవేట్ హంతక ముఠాల ఆగడాలు పెచ్చురిల్లాయి.
భోనగిరిలో నిర్వహించిన సభ దగాపడ్డ తెలంగాణ సభ అనంతరం ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపారు. తెలంగాణ మహాసభ నిర్వహణ అనంతరం మారోజు వీరన్నను బూటకపు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ఉద్యమం ముందుకు సాగుతుండటంతో కరీంనగర్ లో జనసభ నాయకుడు అల్లుబెల్లి రవీందర్ రెడ్డి హత్య, భువనగిరిలో తెలంగాణ కళాసమితి రాష్ట్ర కో-కన్వీనర్ బెల్లి లలితను పదిహేడు ముక్కలుగా నరికి చేసిన క్రూర హత్య, ప్రైవేట్ హంతక ముఠా చర్యలు అందులో భాగమే. ఇలాంటి పాశవిక నిర్భంధంలో కళాసమితికి రాజీనామా చేయమని జహంగీర్ పై చిత్రహింసలతో ఒత్తిడి తెచ్చారు. ససేమిరా అంటూ రాష్ట్ర నాయకత్వ సూచన మేరకు ఊరు వదిలి ఆరు నెలలు జనసభ కార్యాలయం హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. జహంగీర్ కోసం అతని తండ్రిని చిత్ర హింసలు పెట్టారు. కుటుంబంలో నిత్యం సమస్యలు వేధించినా తట్టుకుని నిలబడ్డ ధీశాలి.
    తీవ్రనిర్భంద కాలం ముగిసిన తర్వాత తిరిగి వచ్చి సామాజిక చైతన్య కార్యక్రమాలలో నిమగ్నమయ్యాడు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ రాజుకోవడంతో తన కార్యాచరణకు పదునుపెట్టాడు. వేలాది గ్రామాలు తిరిగాడు. గద్దర్ తో పాటు అనేక మంది కళాకారులతో కలిసి ప్రదర్శనలిచ్చాడు. నాటి చిత్రహింసలతో దెబ్బతిన్న శారీరక సమస్యలకు తోడు గుండె సంబంధిత సమస్యలు పెచ్చురిల్లాయి. అయినా, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చెయ్యకుండా, జనసభ రాష్ట్ర కన్వీనర్ భూమయ్య, కో-కన్వీనర్ కనకాచారి, బెల్లి లలిత రాజ్య హింసకు బలవుతున్నా వెనకడుగు వేయకుండా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలిచిన సాంస్కృతిక సేనాని జహంగీర్. మధ్యంతరంగా చిన్న వయసులో గుండెపోటుతో జీవితాన్ని ముగించుకొని 2 ఏప్రిల్ 2026 న అమరుడయ్యాడు. తెలంగాణ ఉద్యమానికే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతతో కదిలిన జహంగీర్ ఆదర్శ ప్రాయుడైన కళాకారుడు. కళ కళ కోసం కాదు, కళ ప్రజలకోసం అన్న విషయానికి నిలువెత్తు నిదర్శనం జహంగీర్. ఈ తరానికే కాదు, అన్ని తరాల కలకారులకు, ఉద్యమ కారులకు మార్గదర్శి. వేలాది అమరుల త్యాగాలతో సాధించిన భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో జహంగీర్ కలలు కన్న దోపిడీ, పీడన, అణిచివేత లేని ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం పునరంకితం కావడమే జహంగీర్ కు మన మిచ్చే నిజమైన నివాళి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *