తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నది. బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురుగా ప్రపంచానికి పరిచయమైన కల్వకుంట్ల కవిత నేడు శనివారం కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. బిఆర్‌ఎస్ పార్టీనుండి సస్పెండ్ అయిన దాదాపు ఎనిమిది నెలలకే ఆమె స్వంతంగా ఒక రాజకీయ పార్టీని నెలకొల్పబోతున్నారు. ఈ పార్టీ విషయంలో ఇప్పటివరకు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు ఆ పార్టీలు దీర్ఘాలోచనలో పడ్డాయి. ఆమె పార్టీ పెట్టడంవల్ల నష్టపోయేది ఎవరన్నది కొద్ది కాలంగా రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. మొదటగా బిఆర్‌ఎస్‌కు అది గొడ్డలిపెట్టుగా మారనున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటినుండి బిఆర్‌ఎస్ అధినే కెసిఆర్ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేడన్న విషయం బాగా ప్రచారంలోఉంది. ముఖ్యమైన శాసనసభ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడం, ఆ పార్టీనుండి పలువురు ఎంఎల్‌ఏలు నిష్క్రమిస్తున్నా పెద్దాయన పెద్దగా చలించకపోవడం ఆ పార్టీ నేతల్లో కొంత నైరాశ్యానికి కారణమైంది. దానికి తగినట్లుగా కవిత ఎపిసోడ్ ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. దిల్లీ లిక్కర్ కేసులో కవిత జైల్ జీవితం అనుభవించడం, ఆమె పార్టీలో జరుగుతున్న విషయాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపై పార్టీ అధినేత కెసిఆర్‌కు రాసిన లేఖ బహిర్ఘతం కావడం, దానిపై కవిత పార్టీలోని ముఖ్యనాయకులపై విరుచుకుపడడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ ఆమెను సస్పెండ్ చేయడం తదితర విషయాలు ఆ పార్టీ మనుగడకు ప్రశ్నార్ధకంగా మారాయి. దానికి తగినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పార్టీపైన, పార్టీ అధినేత కెసిఆర్‌పైన చేస్తున్న మాటల దాడి, మోపుతున్న కేసులు ఇబ్బందికరంగా మారాయి.
ఇదిలాఉంటే ఇటీవల కాలంలో కవిత సాక్షాత్తు తండ్రి కెసిఆర్ తాజా బహిరంగసభ ప్రసంగంపైన తీవ్రంగా విరుచుకుపడడం లాంటి సంఘటనలు బిఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ తమ భవిష్యత్‌పై ఆలోచించుకోవడానికి కారణంగా మారుతున్నాయి. శనివారం ప్రకటించనున్న పార్టీ పేరును కవిత నిగూడంగా ఉంచడం ఆసక్తిని కలిగిస్తున్న మరో అంశం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యభూమిక నిర్వహించిన టిఆర్‌ఎస్ తర్వాత బిఆర్‌ఎస్‌గా మారింది. అయితే ఆ టిఆర్‌ఎస్‌ను ఎవరైనా తమ పార్టీకి వాడుకోవచ్చంటూ కవిత చేసిన ప్రకటన కూడా చర్చనీయాంశంగా మారింది.
నిజంగానే కవిత తన పార్టీకి ఆ పేరు పెట్టుకున్నట్లు అయితే బిఆర్‌ఎస్‌కు మరింత ఇబ్బందకరంగా మారనుందన్నది నిజం. ఆ భయంతోనే బిఆర్‌ఎస్ క్యాడర్ మళ్ళీ తమ పార్టీ టిఆర్‌ఎస్‌గానే మారుతుందన్న లీకులిచ్చారు. ఏది ఏమైన కవిత పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ముహూర్తంకూడా సిద్దమైంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణంపైన ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ అని పేరుంది. అంటే టిపిఎస్‌గా పార్టీపేరు పిలవబడుతుందా అన్న ఆలోచన ఒకటి కలుగుతోంది. వాస్తవానికి ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా ఆమె తన పార్టీకి నామకరణం చేసే అవకాశాలున్నట్లుగా ఇంతకాలం చర్చ జరుగుతున్నది. కాని టిపిఎస్ అంటే 1969లో తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్) మాదిరిగా ప్రజల్లోకి ఆ పేరు దూసుకు వెళ్తుందను కుంటుందనుకుంటున్నారు. తాజగా మీడియా అడిగిన ప్రశ్నకు కూడా ఆమె తినబోతూ రుచిఎందుకని దాటవేశారు.
నాలుగుపదులు దాటిన కవిత తన రెండవ ఇన్నింగ్‌ను ప్రారంభించబోతున్నది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన కవిత తన తండ్రి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం చేస్తున్న పోరాటంలో భాగస్వామిని కావాలని 2006లో విదేశంనుండి భారత్‌కు తిరిగి వచ్చి ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తెలంగాణ జాగృత్తి పేర సాంస్కృతిక, సామాజిక సంస్థను ఏర్పాటు చేసింది. ప్రధానంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణను ఇవ్వడంతోపాటు, తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనానికి కృషిచేసింది. ముఖ్యంగా ఉద్య మంలో భాగంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింభమైన బతుకమ్మను విశ్వవ్యాపితం చేసింది.
నల్లమల అడవుల్లోని చెంచు గిరిజన జీవనోపాధి, ప్రకృతి పరిరక్షణ తదితర విషయాలపై తన వంతు కృషిచేసింది. వివిధ ట్రేడ్ యూనియన్‌లకు గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగిన కవిత తర్వాతి కాలంలో పార్లమెంటు సభ్యురాలుగా, ఎంఎల్సీగా కొనసాగారు. దిల్లీ కుంభకోణంలో భాగస్వామి అయిందన్న ఆరోపణపై ఆమె జైలుకు వెళ్ళడం, అనంతరం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాసిన లేఖ బహిర్ఘతం కావటం, దానిపై ఆమె పార్టీలోని ముఖ్యనేతలపై తీవ్రస్థాయిలో బహిరంగ ఆరోపణ చేయడం ఫలతంగా 2025 మే 2న సస్పెండ్‌కు గురైనారు. అప్పటినుండి తానే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తానని ప్రకటించి కవిత నేడు దానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
పార్టీలో చేరబోయే ప్రముఖ్యులెవరు : వివిధ పార్టీలకు చెందిన అనేకులు తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని గత కొద్దికాలంగా కవిత పేర్కొంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇంతవరకు ప్రముఖుల పేర్లేవి వినిపించడంలేదు. ముందుగానే చెప్పినట్లు పార్టీ ఆవిర్భావం రోజున చేరికలుండకపోవచ్చు. కాని ఆ పార్టీవైపు మొగ్గు చూపేది ఎవరన్న చర్చమాత్రం బాగానే జరుగుతున్నది. అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నా కవిత టార్గెట్ అంతా బిఆర్‌ఎస్ పైనే ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంఎల్‌ఏలు, సీనియర్ నాయకులు తమ టచ్‌లో ఉన్నారని ఆమెతో సహా ఆ పార్టీ నేతలు లీకులిస్తూనే ఉన్నారు.
తెలంగాణ అస్థిత్వమే పునాదిగా, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని చెబుతున్న కవిత, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోవడమే తమ లక్ష్యంగా చెబుతున్నది. ముఖ్యంగా తమ పార్టీలో యువతకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు ఆమె గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో చెందిన వారు కాకుండా అందరికి సమాన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తామంటున్నారు కవిత. ఇప్పటికైతే విశ్వకర్మ రాష్ట్ర సహకార సంఘం నేత తాటికొండ శ్రీనివాసాచారి జాగృతిలో చేరారు. పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువ కప్పి కవిత స్వాగతించారు. బోథ్ ఎంఎల్‌ఏ రాథోడ్ బాపురావు కవితను కలిసినవారిలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తమ పార్టీలోకి క్యూ కట్టే అవకాశాలున్నాయంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.