- 25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం.
- రూ.10 వేల కోట్లతో రైతు బంధు
- సీతారామ టన్నెల్ పనుల పరిశీలన
భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 : సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఆయన యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయన్నారు. . టన్నెల్ లోపలికి అధికారులను వెంటబెట్టుకుని తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లారు.
అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 25 లక్షల మందికి రూ.21 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. రూ.10 వేల కోట్లు రైతుబంధుకు కేటాయించామన్నారు. . సన్న వడ్లకు బోనస్ గా రూ.11 వందల కోట్లకు రూ.900 కోట్లు జరిగిందన్నారు. డబ్బులు త్వరలో రైతుల అకౌంట్లో పడతాయన్నారు.. రాష్ట్రంలోనే సత్తుపల్లి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతం రాష్ట్రంలోనే ఎక్కడా లేదన్నారు. ఆ అభివృద్ధిలో పాలుపంచుకున్న తనకు గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏ ప్రాజెక్టును నమ్ముకున్న ఏదో ఒక నాటికి ఎండిపోతున్నాయన్నారు. వీటి నుంచి శాశ్వత పరిష్కారం గోదావరి ఒక్కటేనన్నారు
. సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతుల కల నెరవేరుతుందన్నారు . ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ప్రాజెక్టు వరప్రదాయని అన్నారు. జిల్లా అంతట సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించినట్లు తుమ్మల చెప్పారు.. జిల్లాకు గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ రహదారులు కూడా అన్ని మార్గాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు., జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వరకు మరో రహదారికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అన్నారు. భవిష్యత్తు అంతా వ్యవసాయ రంగానిదే అన్నారు. రైతులంతా హార్టికల్చర్ సాగుపై దృష్టి సారించి ఆర్థిక సుస్థిరత సాధించాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం తన స్వప్నమన్నారు. జిల్లా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే ఈ ప్రాజెక్ట్ కోసంఅన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్టుకు ప్రజలు భూసేకరణ సహకరించారని, వారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తిచేసి గోదావరి జలాలు అందజేస్తామని పేర్కొన్నారు. లంకసాగర్ ప్రాజెక్టు కూడా చెరువుల ద్వారా గోదావరి జలాలు అందుతాయన్నారు. భూసేకరణ పరిహారం అందజేయడంలో కుటుంబ కలహాలు ఉన్నవారికి సాగులో ఉన్న రైతు ఖాతాలో పరిహారం జమ చేసి పనులు చేయాలన్నారు. భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అప్రమత్తంగా ఉంటూ భూ సేకరణ నష్ట పరిహారం వ్యవహారం పూర్తి చేయాలని ప్రాజెక్ట్ పనులు ఎక్కడా ఆగడానికి వీలులేదని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని తుమ్మల అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ స్థాయి అధికారులు వొచ్చినప్పటికీ కొందరు తహసీల్దార్లు హాజరుకాకపోవడం విచారకరమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వొహిస్తే సహించేది లేదన్నారు. రెండు జిల్లాలకు చురుకైన కలెక్టర్లు ఉండడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. వారి సహకారంతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నాయకులకు కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజామిల్ ఖాన్, జితేష్ వి పాటిల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి ఆర్డిఓ రాజేందర్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు.




