శాస్త్రీయంగా భూముల విలువల సవరణ

  • క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువల నిర్ణయం
  • ఈ నెల 5 నుంచి అమలు: – రెవెన్యూ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నచోట్ల క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి వస్తాయని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్ధతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు భూముల ధరలను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందన్నారు. శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువల నిర్ణయం జరిగినట్లు తెలిపారు. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని మంత్రి వెల్లడించారు.

గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయని చెప్పారు. ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవలి భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్, రీజినల్ రింగ్ రోడ్, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని విలువలను నిర్ణయించినట్లు తెలిపారు. ఫ్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అంతస్తుల వారీగా అధిక రేట్లు నిర్ణయించడం వల్ల అసమానతలు ఏర్పడ్డాయని, అలాంటి చోట్ల అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదన్నారు.

అలాగే ప్రాంతాల అభివృద్ధి స్థాయినిబట్టి హెచఎండీఏ, క్యూర్ పరిధి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నిర్మాణ వ్యయాలను కూడా 2021 తర్వాత సవరించలేదని, గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్ల సవరణ అవసరమైందని పేర్కొన్నారు. అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సవరణలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకత పెంపునకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *