వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

– 18 లక్షలమంది విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం
– విద్యాశాఖ, మీసేవ నేతృత్వంలో వినూత్న కార్యక్రమం
– డిజిటల్ మస్కట్‌గా పాలపిట్టతో సమాచార వ్యాప్తి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 :డిజిటల్ పాలనలో ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా స్కూల్ అప్‌డేట్స్ నేరుగా వారి ఫోన్‌లకు చేరనున్నాయి. ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికిపైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ-మీసేవ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి అభివృద్ధి చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు పారదర్శకంగా, సులభమైన రీతిలో వేగవంతమైన సేవలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్ ద్వారా మీసేవ ప్రస్తుతం అందిస్తున్న సేవలు

విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్ల డౌన్‌లోడ్, మార్కుల మెమోలు, పరీక్షా ఫలితాలు, ఎసఎస్‌సీ మెమోలు
బోనఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, ఎసఎస్‌సీ మెమో సవరణల దరఖాస్తులు. ఈ సేవల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి సమయంతోపాటు వ్యయం ఆదా అవుతోంది.

త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు

తదుపరి దశలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు సమాచారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు. క్రీడలు, సహ పాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు. విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్‌లో పంపిస్తారు. దీనివల్ల ప్రభుత్వ విద్యా సమాచార ప్రసారం మరింత సులభంగా, ఆకర్షణీయంగా, ప్రజలకు చేరువవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు చేరువైన, సమర్థవంతమైన డిజిటల్ సేవల అందింపులో రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వాట్సాప్ ఆధారిత పాఠశాల విద్యా సేవల ప్రారంభం రాష్ట్ర డిజిటల్ పరివర్తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *