– ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్’ ప్రదానం
– విదేశాంగ మంత్రి జయశంకర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక “ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్”ను ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల్లో తెలంగాణ పోలీసుల విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించింది. న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జూన్ 17 నుంచి 19 వరకు నిర్వహించిన పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుక లో సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ కార్యాలయాలు, వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ ధృవీకరణ అత్యంత కీలకమైన అంశమని, ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం, ప్రజా సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో అందిన 8,67,741 పాస్‌పోర్ట్ దరఖాస్తుల్లో ఇప్పటికే 8,67,452 (99%) దరఖాస్తుల ధృవీకరణను తెలంగాణ పోలీసులు పూర్తి చేశారు. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,06,684 పాస్‌పోర్ట్ దరఖాస్తులను సగటున ఏడు రోజుల లోపే ధృవీకరించి దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 2013-16 మధ్య కాలంలో పనిచేసిన ప్రస్తుత డీజీపీ సి.వి. ఆనంద్ 2014లో పాస్‌పోర్ట్ ధృవీకరణ కోసం ప్రత్యేకంగా ‘వెరిఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. 2015లో ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తెలంగాణ పోలీసులకు ఇప్పటివరకు ఏడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఇది దేశంలోని అత్యుత్తమ పోలీస్ సంస్థలలో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక స్థానం కల్పించింది. పాస్‌పోర్ట్ ధృవీకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసిన ‘వెరిఫాస్ట్’ వ్యవస్థ కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా మ్యాచింగ్ సాంకేతికతల ఆధారంగా పనిచేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సీసీటీఎన్‌ఎస్ , పూర్వపు పాస్‌పోర్ట్ రికార్డులు, ఇతర డేటాబేస్‌లతో సరిపోల్చి అనుమానాస్పద వివరాలు, నకిలీ దరఖాస్తులు, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను త్వరితగతిన గుర్తించే అవకాశం కలుగుతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలపై అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ పోలీసు అధికారులకు ధృవీకరణ ప్రక్రియలో తోడ్పాటు అందించడమే కాకుండా, దరఖాస్తుదారులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. భవిష్యత్తులో పౌరులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని ధృవీకరణ అపాయింట్‌మెంట్‌ను షెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా సేవలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ పోలీసులు పలు సాంకేతిక సంస్కరణలను అమలు చేస్తున్నారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసు సిబ్బంది అంకితభావం, సేవా దృక్పథానికి ప్రతిబింబమని, భవిష్యత్తులో మరింత వేగవంతమైన, ప్రజలకు చేరువైన సేవలను అందించేందుకు ఇది స్ఫూర్తినిస్తుందని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





