– ఆయనతోపాటు 20 మంది మంత్రులు కూడా
– రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య, డీకే, భట్టి హాజరు
తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం జరిగిన 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టినవారే కావడం గమనార్హం. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రులను ఎంపిక చేసింది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, సిద్ధ రామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు. సీఎం సతీశన్ ఆర్థిక, ఓడరేవుల శాఖలు సహా పలు కీలక పోర్ట్‌ఫోలియోలను తనవద్దే ఉంచుకునే అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితాలకు విజిలెన్స్‌తో పాటు హోం శాఖ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూ శాఖ కేటాయించాలని యÖడీఎఫ్ నిర్ణయం తీసుకుంది. కాగా, కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో 1964లో వీడీ సతీశన్ జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన సామాజిక కార్యకర్తగానూ పేరొందారు. కేరళ విద్యార్థి విభాగంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. తర్వాత యÖత్ కాంగ్రెస్‌లో చేరి పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రజానేతగా సంస్కరణాభిలాషిగా ఎదిగారు. 2001లో పరావుర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. 2021లో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలుపొందగా యూడీఎఫ్ విపక్షానికే పరిమితమైంది. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్ వివాదం, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. అందుకే ప్రస్తుతం సీఎం ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో కూడా ఎమ్మెల్యేలు, ప్రజలు సతీశన్‌కే మద్దతు ఇచ్చారు.కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్నాటక సీఎం సిద్థ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి సతీశన్‌కు, ఆయన మంత్రివర్గ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


మహిళలకు ఉచిత ప్రయాణం.. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక విభాగం
ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
కేరళంలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కేరళం ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సతీశన్ తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక సంక్షేమ, పాలనా సంబంధిత నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 15 నుంచి మహిళలకు కేఎసఆర్‌టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులు, రోజువారీ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. వృద్ధతరం పెరుగుతుండటం, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ల హెల్త్‌కేర్, సామాజిక భద్రత, పునరావాసం, సంక్షేమ పథకాలను ఈ ప్రత్యేక శాఖ సమన్వయం చేస్తుందని చెప్పారు. ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3,000కు పెంచారు. కేరళం హెల్త్‌కేర్ సిస్టంలో ఆశా వర్కర్ల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వర్కర్లు, హెల్పర్లకు రూ.1,000 చొప్పున వేతనం పెంచుతున్నామని, పాఠశాలల్లో వంటలు చేస్తున్న వారు, సహాయక సిబ్బంది, ప్రీ-ప్రైమరీ టీచర్లకు అదనంగా రూ.1,000 వేతనం పెంచుతున్నామని చెప్పారు. 2023 నవ కేరళం యాత్ర సందర్భంగా యువజన కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడులపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం సతీశన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధించేందుకు, జవాబుదారీతనాన్ని పాదుగొలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని, రుణాలు, వ్యయం, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పారదర్శకతకు కట్టుబడి ఉంటామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



