– వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు
కాళేశ్వరం, ప్రజాతంత్ర, మే 27: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద తెల్లవారు జాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 21న ప్రారంభమైన పుష్కరాల్లో భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి పుష్కరఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించి పుష్కరాల ప్రాముఖ్యతను వివరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పుష్కర స్నానమాచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో సకల ఐశ్వర్య ప్రాసస్థ్యం దుర్గ సూక్త హోమం అత్యంత వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్‌ను చూసి మురిసిపోయిన భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. సరస్వతి పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత, శివుని విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎగ్జిబిషన్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మంగళ, గురువారాల్లో కాల సర్ప దోష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. పుష్కరాల నేపథ్యంలో ఆ పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



