– ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనాలి
– ఇసుక రవాణా ఆపి ఆ లారీల్లో ధాన్యం తరలించాలి
– రైతు సమస్యలు వదిలేసి ధర్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు
– చిన్నకోడూరులో మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 27 : ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాలం పండించిన పంట అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతోపాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం సందర్శించి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులకు ధైర్యం చెప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయన్నారు. వడ్లు, మక్కలు, సన్ ఫ్లవర్, శనగలు, జొన్నలు కొనమంటే కాంగ్రెస్ నాయకులు కేంద్రం మీద నెపం నెడుతున్నారని, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ వాళ్లు వడ్లు కొనాలని ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ లెవీ కోటాను, ఎరువుల కోటాను రాష్ట్రానికి సకాలంలో ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రైతులను గాలికి వదిలేసి ఇద్దరూ కలిసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆరఎస్ పాలనలో ఎరువులకు, వడ్ల కొనుగోళ్లకు ఏనాడూ ఇబ్బంది రాలేదన్నారు. నాడు కేసీఆర్ కాళేశ్వరం జలాలతో బంగారం పండిస్తే ఇవాళ కొనేవాడు లేక ఆ పంట అమ్ముకోవడం రైతులకు కష్టమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా రోహిణీ కార్తె నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని, కానీ ఈ ప్రభుత్వం ఆన్‌లైన్ ట్యాగింగ్, కొత్త రూల్స్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. ‘రాష్ట్రంలో 80% వడ్లు కొన్నాం అని ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కూర్చుని చెబుతున్నారు.. అక్కడ కూర్చుంటే నిజాలు తెలియవు.. ఏ మార్కెట్‌కి పోయినా ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే ముగ్గుతోంది. అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారన్నారు. తడిసిన వడ్లు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయని, వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించి కలెక్టర్లు, తహసీల్దార్లు, డీఆర్డీఏ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకెళ్తే మిల్లర్లతో మీరే మాట్లాడుకోండని చేతులెత్తేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్ కింద రాస్తూ ఎకరాకు రూ.6700, అలాగే క్వింటాలుకు 3 నుంచి 5 కిలోల తరుగు పేరుతో మరో రూ.3000 వెరసి ఒక్కో రైతు రెండు రకాలుగా వేలాది రూపాయలు నష్టపోతున్నాడన్నారు. రవాణా, హమాలీ, ట్రాక్టర్ల వెయిటింగ్ చార్జీలు, కాంటా డబ్బులు అన్నీ రైతుల నెత్తినే రుద్దుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తొలుత 90 లక్షల టన్నులు కొంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్ష టన్నులే కొంటాననడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే ఇచ్చిందన్నారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ధర్నాలు చేయడం కాదు.. దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచేలా కొట్లాడాలి అని హరీష్‌రావు సూచించారు. ఆనాడు కేంద్రం కోటా ఇవ్వనప్పుడు కేసీఆర్ మంత్రులతో దిల్లీ వెళ్లి ధర్నా చేశారని, కొనకపోయినా రైతులు నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండు నెలలుగా సన్‌ఫ్లవర్ కొనకపోవడంతో చెదలు పడుతోందని, కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. వానాకాలం వస్తున్నా జీలుగ, జనుము విత్తనాలు, ఎరువుల స్టాక్ రెడీ చేసుకోలేదని, వ్యవసాయం, రైతులు ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగానే లేరని ఎద్దేవా చేశారు. కేంద్రం మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రూ.3 వేల కోట్ల భారం మోపితే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ పెంచి మరో రూ.2 వేల కోట్ల భారం మోపిందని, ఇద్దరూ కలిసి రైౖతుల, సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ.. ముందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 27% వ్యాట్‌ను 10%కి తగ్గించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అన్నారు. బక్రీద్ పండుగ వస్తుండటంతో లారీ డ్రైవర్లు దొరకరు కాబట్టి ప్రభుత్వం వారం రోజులపాటు ఇసుక తవ్వకాలు, రవాణాను ఆపి వేలాదిగా ఉన్న ఆ లారీలను, ఆర్టీయే అధికారులను వడ్ల రవాణాకు కేటాయించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





