– ఏర్పాట్లను సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్‌ను త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన శనివారం సమీక్షించారు. హాస్పిటల్‌లోని ఏ, బీ, సీ బ్లాకులను సందర్శించిన మంత్రి ఓపీ రిజిస్ట్రేషన్, ఇన్‌పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, సీటీ స్కాన్, ఎంఆరఐ, డయాగ్నస్టిక్స్, ల్యాబొరేటరీలు, బ్లడ్ బ్యాంక్, మెకనైజ్డ్ ల్యాండ్రీ, సెంట్రలైజ్డ్ కిచెన్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతులు, వైద్య సేవల నిర్వహణ వ్యవస్థలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హాస్పిటల్ ప్రారంభానికి ముందు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఓపీ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు, ఫార్మసీ సేవలు, వెయిటింగ్ ఏరియాలను మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. సీటీ స్కాన్, ఎంఆరఐ, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర ఆధునిక యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులో ఉండేలా అవసరమైన డాక్టర్లు, టెక్నీషియన్లు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఈ హాస్పిటల్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్యాథ్‌ల్యాబ్‌లు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సదుపాయాలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా సనత్‌నగర్ టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించగల అత్యుత్తమ వైద్య సంస్థగా టిమ్స్ నిలవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రోగులతోపాటు వారి సహాయకులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ధర్మశాల, క్యాంటీన్లు, పార్కింగ్ సదుపాయాలు, హాస్టల్ బ్లాకులు, ఇతర సహాయక సేవలను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వహణ, వైద్య సేవలు, మానవ వనరులు, నాన్ మెడికల్ సర్వీసులు, భద్రత, పారిశుధ్యం తదితర అంశాలపై అవసరమైన సూచనలు చేశారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


