ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతు కనకయ్య బలి

– తడిసిన వడ్లు కొనాలని ప్రాధేయపడితే 40 సంచులు కట్ చేశారు
– కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
– కోతలు లేకుండా వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్
– ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో అవకతవకల వల్లే ఇవాళ నారాయణరావుపేట గ్రామానికి చెందిన కనకయ్య అనే రైతు బలి అయ్యాడని సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉప నాయకుడు హరీష్‌రావు ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్) గుండెపోటుతో శనివారం మృతిచెందాడు. ఆయ‌న‌ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కనకయ్య మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి హరీష్ రావు ఆర్థిక సహాయం అందించారు. కనకయ్య పండించిన వడ్లను మార్కెట్ యార్డులో దాదాపు 45 రోజులపాటు ఎవరూ కొనకుండా ఆలస్యం చేయ‌గా వర్షానికి వడ్లన్నీ తడిసిపోయాయి. తడిసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్లి ప్రాధేయపడితే నాలుగు ట్రాక్టర్ల వడ్లకు గాను 40 సంచుల వడ్లను మిల్లర్లు కట్ చేశారు. 40 సంచుల వడ్లు కట్ చేసిండ్రు అని నిన్న రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో బాధపడుతూ నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చి మరణించాడని తెలిపారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో కూర్చుని 80% – 90% వడ్లు కొన్నామని ప్రభుత్వం చెప్తోంది.. కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ఇంకా 30% నుండి 40% వడ్లు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వర్షాలు పడుతున్నాయి.. కొన్ని గ్రామాల్లో రెండు నెలలుగా వడ్లు అమ్ముకోలేక మిల్లులు, గోదాముల ముందు లారీలతో రోజులతరబడి పడిగాపులు కాస్తున్నారు.. క్వింటాల్‌కు 4 నుండి 5 కిలోల కోత పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పంట పండించడం సులభంగా ఉంది కానీ ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు నరకం కనిపిస్తోంది అని హరీష్‌రావు విమర్శించారు. కుకునూరుపల్లి దగ్గర ఒక రాజస్థాన్ లారీలో వడ్లు ఎక్కించే ప్రయత్నం చేస్తే ఆ లారీ వడ్లతో సహా రాజస్థాన్ వెళ్ళిపోయిందన్నారు. దుబ్బాక మండలం చేర్వాపూర్‌లో సంచులు ఎత్తకపోవడం వల్ల, అలాగే ఎన్సాన్‌పల్లిలో కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్నాయని చెప్పారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ వడ్లు కూడా కొనలేదన్నారు. ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయని, రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయి సమస్యలు వదిలేశార‌న్నారు. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది.. రైతుబంధు ఇవ్వకుండా మోసం చేసింది.. నాలుగు నెలలుగా రాష్ట్రంలో చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదు.. దానిని రద్దు చేశారు.. అధికారులు, మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. ప్రభుత్వం కలెక్టర్ వెంటనే స్పందించి కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *