మహిళా భవనాల పనుల పురోగతిని పరిశీలిస్తా

– రోజూ వీసీలతో పనుల సమీక్ష
– అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతి రోజూ తాను పరిశీలిస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై రోజువారీగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఉపాధి హామీ పనులు, గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్ శాఖ అధికారులతో ఆమె శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క అక్కడినుంచే ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల శంకుస్థాపన చేసిన ఎనిమిది వేల గ్రామ మహిళా సమాఖ్య భవనాలు కేవలం నిర్మాణాలు కాదని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచే ఆత్మగౌరవ భవనాలు అని పేర్కొన్నారు. వాటి నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ పనుల పురోగతిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, అవసరమైతే రోజువారీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి ఎంపీడీవో తమ మండలంలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ గ్రామాల్లో భవనాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల నాణ్యత, పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలు జరగాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *