తురక కాశల జీవితాల్లో వెలుగులు రావాలి

– ముస్లిం మైనార్టీల సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
– తురక కాశలకు రూ.5 కోట్ల నిధుల కోసం అసెంబ్లీలో గళమెత్తుతా
– అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 06:  తురక కాశల చేతులకు పగుళ్లు రావడం కాదు వారి జీవితాల్లో వెలుగులు రావాలి, కాంగ్రెస్ నాయకులు మాటల్లో తప్ప చేతల్లో ఏమీ చేయడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో సామాజిక సేవకులు, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ సహకారంతో తురక కాశా కులస్థులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం లేదన్నారు. రైతులు, కార్మికులు, మైనార్టీలు సహా అన్ని వర్గాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అందులో కనీసం రూ.1,100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తురక కాశా కులస్థులకు రావాల్సిన రూ.5 కోట్ల నిధులను సైతం విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఈ నిధుల విడుదల కోసం తనవంతు కృషి చేస్తానని, సంబంధిత శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడతానని, అవసరమైతే అసెంబ్లీలో కూడా ఈ అంశంపై గళమెత్తుతానని తెలిపారు. మండుటెండల్లో బండరాళ్లను పగులగొడుతూ జీవనం సాగిస్తున్న తురక కాశా కులస్థులు అసలైన కష్టజీవులని హరీష్ రావు పేర్కొన్నారు. “మీ చేతుల్లో పగుళ్లు వస్తున్నాయి తప్ప జీవితాల్లో వెలుగులు రావడం లేదు. మీ కుటుంబాల భవిష్యత్తు మారాలి. మీ పిల్లలు బండరాళ్ల మధ్య కాకుండా పుస్తకాల మధ్య పెరిగి ఉన్నత విద్యను అభ్యసించాలి” అని అన్నారు.
కెసిఆర్ హయాంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, గురుకుల విద్యాసంస్థల ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని గుర్తు చేశారు. తురక కాశా కుటుంబాలు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించి మంచి భవిష్యత్తును అందించాలని సూచించారు.రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తురక కాశా కులస్థుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, ప్రస్తుతం రూ.5 కోట్లుగా ఉన్న నిధులను మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ నిరంతరం కృషి చేస్తున్నారని హరీష్ రావు కొనియాడారు. ఇప్పటికే తురక కాశా కులస్థులకు 50 యంత్రాలు పంపిణీ చేసిన నేపథ్యంలో, తనవంతుగా మరో 50 యంత్రాలను త్వరలో అందజేస్తానని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *