- ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి
- – డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి
హైదరాబాద్, జూన్ 7: ఎన్నికల సమయంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే సమాన విద్యా అవకాశాలు కల్పించగలమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను భారీగా కుదించే దిశగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విద్యాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని లింగారెడ్డి, సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను మౌలిక హక్కుగా గుర్తించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో పాఠశాలలను పెంచాల్సిన ప్రభుత్వం, వాటిని తగ్గించే ఆలోచన చేయడం అత్యంత విచారకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా విస్మరించడం సరికాదని అన్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే పాఠశాలలను మూసివేయడం పరిష్కారం కాదని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా నాణ్యమైన బోధన, అనుభవజ్క్షులైన ఉపాధ్యాయులు, సమగ్ర మౌలిక వసతులు, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. సమస్యలకు మూల కారణాలను పరిష్కరించకుండా పాఠశాలలను కుదించడం ప్రజా విద్యా వ్యవస్థను బలహీనపరచడమే అవుతుందని తెలిపారు. .
ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కావని, అవి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సామాజిక చైతన్యానికి కేంద్ర బిందువులు. అలాంటి పాఠశాలలను కుదించడం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందుబాటు మరింత దూరమై, డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో విద్యారంగంలో ముందంజలో ఉన్న దేశాలు పాఠశాలలను మూసివేయడం ద్వారా కాకుండా, వాటిని మరింత బలోపేతం చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచుకున్నాయి. తెలంగాణ కూడా అదే దిశగా అడుగులు వేయాలని. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు
ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నందున విద్యారంగానికి తగిన నిధులు కేటాయించి, ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ప్రతి ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యను ప్రజల విశ్వాసానికి కేంద్రంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాఠశాలల కుదింపు ఆలోచనను విరమించుకోకపోతే, ప్రజా విద్య పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఉద్యమాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.


