– దశాబ్దం తర్వాత మోగిన ఎన్నికల నగారా
– కార్మికుల హక్కులను పునరుద్ధరించిన ప్రజాపాలన ప్రభుత్వం
– రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గత ప్రభుత్వ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని, దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను అక్టోబర్ 9న నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల చివరి గుర్తింపు ఎన్నికలు 2016 జూలై 19న జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనకు పోరాడిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడిందని తెలిపారు. కార్మిక సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తింపు కల్పించే ఎన్నికలు జరగకుండా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు.
ప్రజాపాలనలో ఆర్టీసీకి పునరుజ్జీవం
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు వారి హక్కులను కూడా పునరుద్ధరిస్తున్నామన్నారు. తాజాగా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రకటించారు. కార్మిక సోదరులందరూ స్వచ్ఛందంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నానన్నారు. గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. గుర్తింపు సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వాములను చేసి ఇతర రాష్ట్రాల్లో విలీనం అనంతరం ఎదురైన ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా సమగ్రంగా, కార్మికుల ప్రయోజనాలను కాపాడే విధంగా విలీనం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని వివరించారు.. యూనియన్ గుర్తింపు ఎన్నికలు, విలీనం అంశాలపై కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించి ముందుకు సాగాలనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.
కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు
ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు డీఏలు చెల్లించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 2017కు సంబంధించిన 21 శాతం, 2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్ అందించామని, సీసీఎస్, పీఎఫ్ బకాయిల విడుదలతోపాటు నెలవారీ చెల్లింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నామని, 1,432 కారుణ్య నియామకాలు పూర్తి చేశామని, గత ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించిన 250మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని, నాలుగు వేల ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చామని, డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేశామని ఆయన వివరించారు. 2,932 కొత్త బస్సుల కొనుగోలు చేపట్టామని, 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమాన్ని చేపట్టామని, సంస్థ బలోపేతంతోపాటు కార్మికుల సంక్షేమానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు కేవలం ఉద్యోగులు కాదు.. ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముక.. వారి హక్కులను కాపాడటం, సంక్షేమాన్ని పరిరక్షించడం ప్రజాపాలన ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల భాగస్వామ్యంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





