– నెలాఖరులోగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి
– దాదాపు 9వేల మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
– కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గత ప్రభుత్వం మొండిగోడలతో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పూర్తి చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ ఇళ్లను తామెందుకు పూర్తిచేయాలన్న భేషజాలకు పోకుండా ఒక్క క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో 21వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేశామని ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయం నుంచి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, వాటర్‌వర్క్స్, విద్యుత్ అధికారులతో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్‌తో కలిసి మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈనెల 30లోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పారదర్శకంగా డ్రా పద్దతిలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. 2బిహెచ్‌కే ఇళ్లు ఉన్న ప్రాంతానికి 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారినే ఎంపిక చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటర్‌వర్క్స్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని వచ్చే నెలాఖరులోగా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉన్న అనర్హులను తొలగించాలని, ఆ ఇళ్లలో నివసించని వారికి ఫైనల్ నోటీస్ ఇచ్చి రద్దు చేయాలని, నోటీసులకు స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి వారి స్ధానంలో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. క్యూర్ పరిధిలో ఇంటి స్ధలాలు ఉండి అర్హులైన దాదాపు తొమ్మిదివేల మందికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇన్‌ఛార్జి మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక, మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులకు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





