తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం (ఏప్రిల్ 23, 2026) నాడు నర్సంపేట బస్టాండ్ ఆవరణలో మహాధర్నా చేపట్టారు.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదన్న ఆవేదనతో శంకర్ గౌడ్ అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నారు.
సుమారు 80% గాయాలైన ఆయన ను వెంటనే వరంగల్ ఎంజీఎం దవాఖానకు , ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం (ఏప్రిల్ 24) తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
* కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం నేడు (శుక్రవారం) కార్మిక సంఘాలతో చర్చలు జరపనుంది.
**రాజకీయ ,కార్మిక సంఘాల స్పందన:
* శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
* బిఆర్ఎస్ నేత హరీశ్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.
శంకర్ గౌడ్ స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజిపేట. ఆయనకు భార్య లత, కుమారుడు హేమంత్, కుమార్తె షామిలీ ఉన్నారు. నేడు మధ్యాహ్నం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.





