– హైకోర్టు తీర్పుపై చర్చించాం
– కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి
– రిటైర్డు ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నిర్ణయం
– సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు
– పీపీపీ పద్ధతిన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ఆమోదం
– కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర కేబినెట్ సమావేశం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు విలేకరులకు వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే సానుకూల వైఖరితోనే ప్రభుత్వం అధికారుల కమిటీ వేసిందని, ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో శుక్రవారం చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు కేబినెట్ విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని కానీ, కమిషన్ ఇచ్చిన నివేదికను కానీ హైకోర్టు తప్పుబట్టలేదని, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని తెలిపారు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే కేవలం సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబట్టిందని, ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చిందిదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని, తొమ్మిది నెలలైనా దర్యాప్తు ప్రారంభం కాలేదన్నారు. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలియజేశారని, అందుకే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వివరించారు. హైకోర్టు తీర్పు మొత్తం పరిశీలించిన తర్వాత దిల్లీలోని న్యాయ నిపుణులతో సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అనేది వారిచ్చే సలహాలు సూచనల ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు.
రిటైర్డు ఉద్యోగులకు త్వరలో బకాయిలు చెల్లిస్తాం
గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని, తెలంగాణ ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని, రిటైర్మెంట్ వయసు పెంచటంతోపాటు రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయని మంత్రులు తెలిపారు. మంత్రివర్గం ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారి బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదని ఉత్తమ్, పొంగులేటి తెలిపారు. అ తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం సొమ్మును రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రులందరూ ఉదారంగా ముందుకువచ్చారన్నారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు జరపాలని, వీలైనంత త్వŠరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. కాగా, పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పీపీపీ పద్ధతిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి
గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల స్పోర్ట్సుకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్ డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్‌కు ఇచ్చి కమర్షియల్ యాక్టవిటీస్‌కు అనుమతి, కమర్షియల్ యాక్టవిటీస్‌తో వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కూడా నిర్ణయించింది. మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుందని, భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2427 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 1020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినెûట్ ఆమోదం తెలిపిందన్నారు.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ డిపార్టుమెంట్‌కు చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





