రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మారుస్తాం

– గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడితే రహవీర్ అవార్డు
– ‘అరైవ్ అలైవ్’లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి
– రోడ్డు భద్రతపై భారీ బైక్ ర్యాలీ

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పంచవటి విద్యాలయంలో శనివారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ’లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల నుంచి పంచవటి విద్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ‘అరైవ్ అలైవ’ నినాదంతో రోడ్డు, రవాణా శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 నుండి 18వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర’లో హాస్పిటల్‌కు చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి ‘రహవీర’ అవార్డు, రూ.25 వేల పారితోషికం అందిస్తున్నట్లు చెప్పారు. ఏడాదిలో ఒకరు ఐదుసార్లు ఈ అవార్డు పొందవచ్చన్నారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిచేందుకు యునిసెఫ్ సహకారంతో పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మనకు తెలియకుండా జరిగేది యాక్సిడెంట్.. తెలిసి జరిగేది నిర్లక్ష్యం.. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని అన్నారు. పిల్లలకు కొత్త బండి కొనే ముందు పెద్దలు తగు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. దేశంలో ఏడాదికి సుమారు 4.70 లక్షల యాక్సిడెంట్లు జరిగితే దాదాపు లక్షా 50 వేల మంది చనిపోతున్నారని, 3 లక్షల మంది అంగవైకల్యం పొందుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ  రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజూ 70 నుంచి 80 మంది గుండెపోటుతో మరణిస్తుంటే దాదాపు 400 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో ఏడు వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనల ప్రకారం హెల్మెట్లను, సీటు బెల్టును ధరించాలని సూచించారు. రాష్ట్రంలో 10,081 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని, 48 వేల ఆర్టీసీ సిబ్బందికి రోడ్డు భద్రత నియమనిబంధనల మీద అవగాహన కల్పిస్తూ నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో రాష్ట్ర ఆర్టీసీ ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.6% అతితక్కువ ప్రమాదాలను నమోదు చేసుకుందని, దీనిని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ డి.జానకి, చైర్మన్ సీతాదయాకర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మేయర్ గుమ్మాల మమత తదితరులు పలు సూచనలు చేశారు. అనంతరం పంచవటి విద్యాలయంలో హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్‌ను మంత్రులు ప్రారంభించారు.. సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ‘ముడా’ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎన్.వాణి, టీడీసీ¾ రఘు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *