వీబీజీ రాం జీని వాయిదా వేయాలి

– మరింత విస్తృత చర్చ జరపాలి
– ‘ఉపాధి’ బకాయిలను విడుదల చేయాలి
– కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు స్పష్టం చేసిన మంత్రి సీతక్క
– సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వీబీ జీ రాంజీ చట్టంపై మరింత విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాల అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, వీబీ జీ రాంజీ చట్టం అంశాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాల మంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా రాయినిగూడెం గ్రామ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క అక్కడినుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని పలు కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలలుగా కేంద్రం నుండి ఉపాధి హామీ నిధులు విడుదల కాకపోవడంతో కార్మికులకు వేతనాలు అందకపోవడం ఆందోళనకరమని మంత్రి పేర్కొన్నారు. వేసవిలో పనుల సీజన్ పీక్ స్టేజీలో ఉంటుందని, వేతనాల చెల్లింపు ఆలస్యం జరిగితే కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉపాధి హామీ చట్టానికి సంబంధించి రాష్ట్రానికి కేంద్రం నుండి రూ.1110 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇటీవల తరచూ కొత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను ప్రవేశపెడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని అమలు చేయకముందే మరో వ్యవస్థను ప్రవేశపెట్టడం క్షేత్రస్థాయిలో సమస్యలను తెస్తోందని తెలిపారు. మార్పులను దశలవారీగా అమలు చేస్తే అవగాహన, అనుసరణకు తగిన సమయం లభిస్తుందని సూచించారు. మరీ ముఖ్యంగా మోబైల్ నెట్‌వర్క్ అంతగా లేని మారుమూల ప్రాంతాల్లో కూలీల ముఖ హాజరుకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సడలించాలని కోరారు. అలాగే వీబీ జీ రాంజీ చట్టం ద్వారా ఉపాధి పనుల్లో 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాలనే నిబంధన రాష్ట్రాలకు భారంగా మారుతుందన్నారు. దీంతోపాటు నూతన చట్టంలో 60 రోజులపాటు ఉపాధి హలి ను ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి కూలీలు పట్టణాలకు వలసలు పోతే గ్రామాలకు తిరిగి రావడం కష్టమని, ఇది ఉపాధి హామీ చట్ట లక్ష్యానికి పూర్తి విరుద్దమని అన్నారు. ఈ నేపథ్యంలో ఏడాదంతా ఉపాధి హామీ పనులు కొనసాగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క ప్రస్తావించిన అంశాల పట్ల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. వీబీ జీ రాంజీ చట్టం పట్ల రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విస్తృత చర్చల అనంతరమే చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *