పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

– కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు
– నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు
– మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వివిధ పనుల కోసం బయటకు వెళ్లిన ప్రజలు ఎండవేడిమి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. శనివారం కుమురంభీం జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రోజురోజుకూ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఉదయం నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. ఉక్కపోత వాతావరణం పెరిగి రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. మార్చి చివరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడి, దక్షిణ భారత దేశంపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా మే, జూన్‌లలో ఎండలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశమూ ఉందని అధికారులు చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *