20 నుంచి ‘వెల్ఫేర్ వీక్ ’

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో వారం వారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’ నిర్వహించనున్నట్లు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు  తెలిపారు. 99 రోజుల కార్యాచరణ అమలు తీరుపై  ఆయ‌న‌ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ రోజువారీ షెడ్యూల్‌ను వివరించారు. 20న అన్ని సంక్షేమ పాఠశాలల్లో వంటశాలలు, పారిశుధ్యంపై సమగ్ర శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి. అధికారులు విద్యాసంస్థలను సందర్శించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించాలి. 21వ తేదీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల కోసం క్విజ్, డిబేట్, చిత్రలేఖనం వంటి పోటీలతో టాలెంట్ ఫెస్ట్ నిర్వహించి సృజనాత్మకతను, మేధస్సును ప్రోత్సహించాలి. 22న హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులపై దృష్టి పెట్టి అంచనాలు సిద్ధం చేసి తగిన అనుమతులు తీసుకుని, వేసవి సెలవుల్లో పనులను పూర్తి చేయాలి. 23న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎంలు)  నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించాలి. విద్యా ప్రతిభను ప్రోత్సహించాలి. 24న యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలను పెంపొందించే ప్రభుత్వ పథకాలను వివరించాలి. 25న విద్యార్థుల కోసం క్రీడలు, కళలు, సంగీతం, డిజిటల్ లిటరసీ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలతో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో బడి బాట కార్యక్రమం నిర్వహించాలి. జిల్లా కలెక్టర్లు ప్రతి కార్యక్రమం అమలును క్షుణ్ణంగా పర్యవేక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఘోష్ సూచించారు. అన్ని కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, తద్వారా విస్తృత ప్రచారం, పారదర్శకత పెరుగుతుందని ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ప్రభుత్వ  పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *