– రాష్ట్ర పరిణామాలపై అధిష్టానం సీరియస్
– త్వరలో నివేదిక సమర్పించనున్న మీనాక్షీ నటరాజన్
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి వరంగల్)
కాంగ్రెస్ తెలంగాణ శాఖలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఒకపక్క సీనియర్ -జూనియర్ గొడవలు, మరోపక్క జిల్లా, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, ఇంకోపక్క విపక్షాల విమర్శల మధ్య నలిగిపోతున్నది. విచిత్రమేమంటే నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంపైనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ఆ పదవిలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలపై అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక పరిశీలకులను పంపించే అవకాశాలున్నాయి. కాగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ఈ విషయంపై ఇప్పటికే రంగంలోకి దిగారు. మూడు నాలుగు రోజులుగా పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సీలు, మంత్రులతో వేరువేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విడివిడిగా ఒక్కొక్కరితో కనీసం 25 నిమిషాల సేపు చర్పించి నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదురవుతున్న పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు, వాటిపై ప్రజల అభిప్రాయాలు తదితర విషయాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తున్నది. వీరందరికీ ముందుగా ప్రత్యేక ప్రశ్నావళితో కూడిన ఫారాలను ఇచ్చి వాటిపై వారి అభిప్రాయాలను స్పష్టంగా రాసి ఇవ్వాలని సూచించారు. వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితుల విషయాలపై ఆమె క్షుణ్ణంగా అవగాహనకు వచ్చినట్లు తెలుస్తున్నది. పార్టీ జిల్లా అధ్యక్షులే సుప్రీం అన్న విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. అలాగే డిసిసి అధ్యక్షులు కూడా తమ పరిధిలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా అందరినీ సమన్వయపర్చుకోవాలని అమె సూచించారు.
విభేదాలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు
నేతల మధ్య విభేదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్ వర్గానికి, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య కొంతకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరుపై అధిష్టానం సూచన మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమన్వయం కూర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే సిద్ధిపేటలో డిసిసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి, మెదక్ జిల్లా అధ్యక్షుడు అంజయ్యగౌడ్ వర్గాల మధ్య కొనసాగుతున్న విబేదాలు తెలిసిందే. నర్సారెడ్డిని కాదని ఆ పదవిని తూముకుంట్ల అంక్షారెడ్డికి కట్టబెట్టినప్పటికీ విభేదాలు అలానే కొనసాగుతున్నాయి.మెదక్ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి వివేక్ ఆ జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ పట్టించుకోవడంలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పాలకుర్తిలో ఎంఎల్యే యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నియోజ వర్గ కార్యకర్తలు, నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. వీరి ద్వంద్వ నాయకత్వం కింద పనిచేయలేకపోతున్నామంటున్నారు. ఎల్జీనగర్ నియోజకవర్గం సమస్య ఇప్పుడు రాష్ట్రవ్యా ప్త0గా హాట్ టాపిక్ గా మారింది. తమ పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని సీనియర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా రు. ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి సంబంధించి బోర్డు మెంబర్ల నియామకంలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోలేదన్న గొడవ ఒకపక్క జరుగుతుం డగా బోర్డు మెంబర్ గా నియమితురాలైన సీనియర్ నాయకురాలు శంకరమ్మపై యూత్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. కాగా, జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విషయమై ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి రెండు రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని కోరినట్లు తెలుస్తున్నది. ఇక మరో ఇద్దరు సీనియర్ నాయకుల మద్య పచ్చి గడ్డివేస్తే భగ్గు మంటోంది. వారిలో ఒకరు వరంగల్ తూర్పు ఎంఎల్యే , మంత్రి కూడా అయిన కొండా సురేఖ కాగా మరొకరు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ గణపురం ఎంఎల్యే కడియం శ్రీహరి. శ్రీహరి తన మంత్రిత్వ శాఖకు సంబందించిన వ్యవహారాలను తనకు తెలియకుండానే అధికారులతో సమావేశం కావడాన్ని సురేఖ తప్పు పడుతున్నారు. కాగా ,తాను ఎంఎల్యేగా రివ్వూ చేశాను తప్ప శాఖపై చర్చ కాదంటున్న కడియం మాటలకు ఆమె సంతృప్తి చెందలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితోపాటు అధిష్టానం దృష్టికి తీసుకుపోవడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సురేఖ పట్టుదలతో ఉండడంతో ఈ సమస్య పరిష్కార బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీ స్వాంత్ కు అప్పగించినట్లు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విభేదాలు ఇలానే సాగితే దీని ప్రభావం ఆ ఎన్నికలపై పడే అవకాశాలు లేకపోలేదు. అంతర్గత విభేదాలకు స్వస్తి చెబితే తప్ప మరోసారి అధికారానికి వచ్చే అవకాశాలుండవని పార్టీ నాయకులు అంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





